Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ మతహింసలో హిందూత్వ సంస్థల నేతలపై కేసుల ఉపసంహరణ
న్యూఢిల్లీ : ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురిలో జరిగిన మత హింసకు కారకులుగా విశ్వ హిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలను బహిరంగంగా ప్రకటించిన ఢిల్లీ పోలీసులు, వెంటనే పోలీసులు ఈ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. సంఫ్‌ు పరివార్ సంస్థల ప్రస్తావన లేకుండా మళ్లీ ప్రకటన విడుదల చేశారు. అనుమతి లేకుండా ర్యాలీని చేపట్టినందుకు జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు నిర్వాహకులపై ఢిల్లీ పోలీసులు తొలుత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శనివారం నాటి హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన రెండో కేసు ఇది. శనివారం సాయంత్రం ర్యాలీ నిర్వాహకులపై ఐపీఎస్ సెక్షన్ 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామనీ, వారిలో ఒకరు ఉన్నారని విచారణలో తేలిందని వాయువ్య ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) ఉషా రంగాని తెలిపారు. శనివారం ఉదయం, మధ్యాహ్నం చేపట్టిన మరో రెండు ఊరేగింపులకు తగిన అనుమతి ఉందని ఆమె తెలిపారు. అనుమతి లేకుండా మతపరమైన ఊరేగింపు జరిపినందుకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు డీసీపీ అంతకుముందు అధికారిక సందేశం పంపారు. స్థానిక వీహెచ్‌పీ నేత ప్రేమ్శర్మను అరెస్టు చేసినట్టు కూడా పేర్కొంది. అయితే, ఐపీఎస్ సెక్షన్ 188 కింద నేరం బెయిలబుల్ అని పేర్కొంటూ, తరువాత పోలీసులు ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. విచారణలో చేరిన వ్యక్తిని ప్రశ్నించిన తరువాత వదిలిపెట్టారు. పోలీసులు విడుదల చేసిన సవరించిన ప్రకటనలో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ పేర్లు కూడా లేవు. రెండవ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన వెంటనే, వీహెచ్‌పీ తన కార్యకర్తలు ''ఫ్రేమింగ్''కు వ్యతిరేకంగా కోర్టుకు వెళుతుందని తెలిపింది. ''అనుమతి లేకుండా మేం ఎలాంటి ర్యాలీ నిర్వహించం. ఈసారి కూడా ఢిల్లీ పోలీసుల నుంచి అనుమతి పొందాం. మాకు అనుమతి లేకపోతే మా శోభా యాత్రకు భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేశారని ఎవరైనా వారిని అడగాలి'' అని వీహెచ్‌పీ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేర్కొన్నారు. సభ్యులపై పోలీసులు చర్య తీసుకుంటే ''యుద్ధం'' చేస్తామని హిందూ హక్కుల సంస్థ బెదిరించే స్థాయికి వెళ్లింది.