Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత పదవి..హోదా!
- సీనియర్లను పక్కన పెట్టి..ప్రమోషన్లు
- ప్రధాని మోడీ కార్యాలయంలో పనిచేసిన వారికే పట్టం
- ప్రపంచబ్యాంక్, ఐరాసలో ఉన్నత పోస్టింగ్స్
- పలు దేశాల్లో భారత రాయబారులుగా నియామకం
ఎంతోమంది సీనియర్ ఐఏఎస్ అధికారుల్ని పక్కకు పెట్టి నేపాల్‌లో భారత రాయబారిగా వినరు మోహన్ క్వాట్రాను మోడీ సర్కార్ నియమించింది. 1988 ఐఏఎస్ బ్యాంచ్కు చెందిన ఆయనతో పోల్చుకుంటే, రాయబారి పదవికి అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు ఎంతోమంది ఉన్నారని, అర్హులైన వారిని పక్కకు పెట్టడం ఓ ఆనవాయితీగా మారిందని ఢిల్లీ రాజకీయ వర్గాలు అంటున్నాయి.
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కార్యాలయంలో..ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులైన ఉన్నతాధికారులకు మాత్రమే ప్రమోషన్లు దక్కుతున్నాయని, పలు హోదాల్లో నియమిస్తున్నారని విమర్శలు వెలువడుతున్నాయి. మోడీ ప్రధానిగా మొదటిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో పీఎంవోలో క్వాట్రా పనిచేశారని, ఆ ఒక్క అర్హతతోనే అతడ్ని నేపాల్‌లో భారత రాయబారిగా ఎంపిక చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
మంత్రి పదవి కూడా దక్కింది..
ఆయనొక్కడికే కాదు, పీఎంవోలో ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితంగా పనిచేసినవారు, నమ్మకస్తులకే ఉన్నత పదవీ యోగ్యత, హోదా దక్కుతున్నాయని జాతీయ ఆంగ్ల దినపత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తా కథనాల ప్రకారం, ప్రధాని మోడీ అధికారిక కార్యాలయంలో పనిచేసిన 38మంది ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. డబ్ల్యూటీవోలో, ఐక్యరాజ్యసమితిలో, ప్రపంచ బ్యాంక్‌లో భారత్ ప్రతినిధులుగా ఉన్నతస్థానాల్లో నియమించిన 11మంది పీఎంవోలో పనిచేసినవారే. పీఎంవోలో పనిచేసి రిటైర్ అయిన ఒక ఐఏఎస్ అధికారికి ఏకంగా ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కింది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నేతృత్వం వహిస్తున్న కమిటీ బాధ్యతల్ని ఒక ఐఏఎస్‌కు అప్పగించారు. ఇంకో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పదవీ విరమణ గడువు ముగిసినా..వారి సర్వీస్‌ను పొడగించారు. విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆర్థిక శాఖల్లో అత్యంత కీలకమైన స్థానాల్లో పీఎంవో అధికారుల్ని నియమించారు.
ఒకే ఒక్క అర్హత...అంతే
కేవలం ప్రధాని మోడీ అధికారిక కార్యాలయంలో పనిచేశారన్న ఒకే ఒక్క అర్హత తప్ప, మిగతా విషయాలు పరిగణలోకి తీసుకోవటం లేదని కొంతమంది ఐఏఎస్ అధికారులు విమర్శిస్తున్నారు. విదేశాంగ శాఖలో కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ రిటైర్ కాగానే నేరుగా బీజేపీలో చేరారు. ఆ వెంటనే ప్రధాని మోడీ ఆయనకు విదేశాంగ మంత్రిగా కీలక పదవి కట్టబెట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కె.శర్మ పీఎంవోలో జాయింట్ సెక్రెటరీ హోదాలో పనిచేసి..వాలంటరీ రిటైర్మేంట్ తీసుకున్నారు. ఆ వెంటనే బీజేపీలో చేరారు. జూన్ 2021లో యూపీ బీజేపీ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఆయన్ని నియమించటం వార్తల్లో నిలిచింది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌లో శర్మకు మంత్రిపదవి కూడా దక్కింది.
పీఎంవోలో నృపేంద్ర మిశ్రా ప్రిన్సిపల్ సెక్రటరీగా 2014 నుంచి 2019వరకు పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత పలు ప్రభుత్వ ఆర్గనైజేషన్లకు హెడ్‌గా నియమించారు. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీకి హెడ్‌గా పనిచేశారు. రామ్‌జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీకి హెడ్‌గా కూడా నియమించారు. అలాగే 2014లో పీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా పనిచేసిన ప్రమోద్ కుమార్ మిశ్రాకు ప్రధాని మోడీ ఉన్నత పదవి కట్టబెట్టారు. పీఎంవో ప్రిన్స్‌పల్ సెక్రటరీగా ఆయన 2024 వరకు కొనసాగనున్నారు. పీఎంవోలో 2014-15లో పనిచేసిన బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం, తరుణ్ బాలాజీ, టి.వి.సోమనాథ్, విక్రం మిస్రీలకు కేంద్ర మంత్రిత్వశాఖలో ఉన్నత హోదాలో పదవులు దక్కాయి.
విదేశాల్లో రాయబారులుగా..
తమిళనాడు ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన బ్రజేంద్ర నవనీత్ పీఎంవోలో 2014-19 వరకు పనిచేశారు. 2020లో డబ్ల్యూటీవోలో భారత రాయబారిగా నియమితులయ్యారు. ప్రధాని మోడీ ప్రయివేట్ కార్యదర్శిగా పనిచేసిన రాజీవ్ తోప్నో ప్రపంచ బ్యాంక్‌లో సీనియర్ సలహాదారుగా ఉన్నత పదవి పొందారు. అలాగే పీఎంవోలో పనిచేసిన ఐఎఫ్ఎస్ అధికారులు సంజీవ్ కుమార్ సింగ్లా, జావేద్ అష్రాఫ్, దీపక్ మిట్టల్, మును మహావర్, నామగ్య సి.కాంపా, ప్రతీక్ మాథూర్‌లను ఇజ్రాయెల్, ఫ్రాన్స్, ఖతార్, మాల్దీవులు, నేపాల్‌లలో భారత రాయబారులుగా నియమితులయ్యారు. ప్రతీక్ మాథూర్‌ను ఐక్యరాజ్యసమితిలో కౌన్సిలర్‌గా ఎంపికచేశారు.