Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సీఎన్జీ ధరలపై సబ్సిడీ, చార్జీల సవరణను డిమాండ్ చేస్తూ ఉబర్, ఓలా వంటి రైడింగ్ యాప్స్‌కు చెందిన డ్రైవర్లు చేపడుతున్న ఆందోళనలు రెండవ రోజుకు చేరుకున్నాయి. కాగా, సోమవారం ఆందోళనలు చేపట్టిన ఆటోరిక్షా, ఎల్లో-బ్లాక్ టాక్సీ సంఘాలు... ఢిల్లీ వాసులకు ఉపశమనం కలిగించేందుకు తమ నిరసనలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ డ్రైవర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వోదయ డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఢిల్లీ అధ్యక్షుడు రవి రాథోడ్ మాట్లాడుతూ.. సమ్మెను కొనసాగించాలా లేదా వాయిదా వేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 'ఓలా, ఉబర్ క్యాబ్‌లు మంగళవారం కూడా రోడ్లపై నడవవు. మా డిమాండ్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన చేపడతాం. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణపై పిలుపునిస్తాం' అని రాథోడ్ తెలిపారు. యాప్ ఆధారిత క్యాబ్‌లు రోడ్లపైకి రాకపోవడంతో... రాకపోకల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రయాణ చార్జీలు సైతం డబుల్ వసూలు చేశారు. మయూర్ విహార్ నుంచి నోయిడా ఫిల్మ్ సిటీలోని ఆఫీసు కోసం క్యాబ్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించగా... సమ్మెల కారణంగా చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణీకుడొకరు వాపోయారు. సాధారణంగా రోజు రూ.300 చెల్లిస్తుండగా... మంగళవారం మాత్రం దాని ధర రూ.700గా ఉందని తెలిపారు.