Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలి
- జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపుపై సుప్రీం స్టే
- కోర్టు ఆదేశాలు బేఖాతర్
- ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆదేశాలతోనేనా?
- ప్రతిపక్షాలు, పౌర సమాజం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపు కోసం ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ చేపట్టిన చర్యలను అత్యున్నత న్యాయస్థానం బుధవారం నిలిపేసింది. ఈ అంశంపై తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నారు. అత్యవసరంగా విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత ప్రక్రియను తక్షణమే ఆపేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. యథాతథ స్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆదేశించింది. ఉత్తర ఢిల్లీ నగర పాలక సంస్థ అధికారులు బుధవారం ఈ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రయత్నించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ కొన్ని ఆక్రమణలను తొలగించింది. ఈ నేపథ్యంలో ఈ చర్యలను నిలిపేయాలని కోరుతూ ఓ పిటిషన్ సుప్రీం కోర్టులో దాఖలైంది. సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ జహంగీర్ పురి ప్రాంతంలో అనధికారికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఆక్రమణలను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి నోటీసు అందజేయలేదని అన్నారు. దీనికి జస్టిస్ ఎన్ వి రమణ స్పందిస్తూ ''మేం యథాతథ స్థితిని నిర్దేశిస్తాం. మేం దానిని గురువారం జాబితా చేస్తాం'' అని అన్నారు.
శిక్షార్హమైన చర్యగా ఎలాంటి నివాస వసతి, వాణిజ్య ఆస్తులను కూల్చివేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జమియత్ ఉలమా ఐ హింద్ తరపున న్యాయవాది కబీర్ దీక్షిత్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా సీజేఐ ముందు ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయాన్ని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రస్తావించారు. దీన్ని కూడా గురువారం విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
''మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, హౌం మంత్రితో సహా అనేకమంది మంత్రులు, శాసన సభ్యులు ఇటువంటి చర్యలను సమర్ధిస్తూ ప్రకటనలు చేసారు. అల్లర్లు జరిగినప్పుడు వారి ఇళ్లు, వాణిజ్య ఆస్తులను ధ్వంసం చేస్తామని మైనారిటీ వర్గాలను బెదిరించారు'' పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా క్రిమినల్ కోర్ట్ నిర్ణయించే వరకు బహిరంగంగా, ఏదైనా అధికారిక కమ్యూనికేషన్ ద్వారా నేర బాధ్యతను ఆపాదించకుండా నిరోధించాలని మంత్రులు, శాసనసభ్యులు, నేర పరిశోధనతో సంబంధం లేని ఎవరినైనా ఆదేశించాలని కోర్టు కోరారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేయడానికి బుల్డోజర్లను ఉపయోగిస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ చర్యలు నిందితుల హక్కుల పట్ల పూర్తి విస్మయాన్ని చూపించాయని, కోర్టు విచారణ, తీర్పు లేకుండా నిందితులపై నేరాన్ని మోపడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని అన్నారు.
ఈ కూల్చివేతల్లో బాధితులు ముస్లింలు, దళితులు, ఆదివాసీలు వంటి మతపరమైన, మైనారిటీల నుంచి ఎక్కువగా ఉన్నారని పిటిషనర్ ఎత్తి చూపారు. ''ముస్లింలు అలాంటి దాడులకు పాల్పడితే, వారు న్యాయం ఆశించకూడదు'' అని మధ్యప్రదేశ్ హౌం మంత్రి కూడా పేర్కొన్నట్లు పిటిషన్ లో నొక్కి చెప్పారు. ఈ ఆస్తులను అక్రమంగా నిర్మించారనే వాదన అబద్ధమని, ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద నిర్మించిన ఇల్లు కూడా కూల్చివేశారని తెలిపారు. ఇటువంటి చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21 ప్రకారం వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తున్నాయని, అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న చట్టవిరుద్ధ చర్యలను పరిష్కరించడానికి కోర్టు తక్షణమే చర్య తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.
కోర్టు ఆదేశాలను లెక్కచేయని అధికారులు
అయితే సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం అధికారులు లెక్క చేయలేదు. ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్ ను సంబంధిత అధికారులు ఆపడానికి నిరాకరించారు. సుప్రీం కోర్టు ఆదేశించినా తరువాత కూడా జహంగీర్‌పురిలో కూల్చివేత ప్రక్రియ కొనసాగింది. ఆర్డర్ కాపీ అందిన వెంటనే కూల్చివేత ఆపేస్తామని ఎన్డీఎంసీ అధికారులు తెలిపారు. తమకుపై నుంచి ఏలాంటి ఆదేశాలు అందలేదని నిర్మాణాలను కూల్చివేయడం కొనసాగించారు. దీంతో రెండు గంటల పాటు ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
స్పందించిన సీజేఐ
అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రెటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని సీజేఐ జస్టిస్ ఎన్ వి రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి ఎన్డిఎంసి మేయర్, కమీషనర్, ఢిల్లీ పోలీస్ కమీషనర్, సంబంధిత అధికారుల ఫోన్? నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తరువాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా.. సుప్రీం ఆదేశాల మేరకు తాము ఈ కూల్చివేత ప్రక్రియను నిలిపివేస్తామని ఇక్బాల్ వెల్లడించారు.
ఢిల్లీ హైకోర్టులో విచారణ
ఇదే అంశంపై విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపిన్ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై సూచనలను కోరుతూ ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మను కోరింది. ''శర్మా మేము దానిని ఈ రోజు వింటాము. మీరు సూచనలతో రండి. మేము మీకు ఎక్కువ సమయం ఇవ్వలేం. ఈరోజే సూచనలతో రండి'' అని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయాన్ని అడ్వకేట్ షారూఖ్ ఆలం ప్రస్తావించారు.''దయచేసి ఈరోజు జాబితా చేయండి. మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు రక్షణ కల్పించండి. కొన్ని గంటల్లో ఏమి మిగిలి ఉండదు'' అని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో ఇదే విధమైన పిటిషన్ దాఖలయ్యిందని ఎఎస్ జి శర్మ ఎత్తి చూపినప్పటికీ జస్టిస్ సంఘి, జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం ఈ విషయాన్ని ఈరోజు విచారిస్తామని తెలిపింది.
జహంగీర్‌పురిలో మరోసారి ఉద్రిక్తత
జహంగీర్‌పురిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బుల్డోజర్ దేశ రాజధానిని చేరుకుంది. జహంగీర్పూర్ అల్లర్ల అనంతరం దేశ రాజధానిలో బుల్డోజర్ చర్చనీయాంశమైంది. అక్రమ నిర్మాణాల పేరుతో తొలగింపునకు తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో.. ఎక్కడైతే హనుమాన్ జమరోపక్కభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు అధికారులు మొదలుపెట్టారు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. 14 పౌరబృందాలతో పాటు తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు. 1,500 మందికి పైగా పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో ఉన్నారు.
ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆదేశాలతోనేనా?
నిర్మాణాలు కూల్చివేయాలంటూ ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సదరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు లేఖ రాశారు. ఆ తర్వాత అక్రమ నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ ప్రారంభమైంది. ఈ డ్రైవ్ రోజువారీ కార్యకలాపాల్లో భాగమేనని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు. ఈ లేఖ రాసిన సమయంలో ఈ చర్యలు చేపట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ అధికారంలో కార్పొరేషన్ చర్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజ్యాంగ విలువల విధ్వంసం : రాహుల్ గాంధీ
జహంగీర్‌పురిలో చట్టవిరుద్ధ ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజ్యాంగ విలువల విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు. పేదలు, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. దీనికి బదులుగా బీజేపీ తన మనసులోని విద్వేషాన్ని బుల్డోజ్ చేసుకోవాలని హితవు పలికారు. రాజ్యాంగాన్ని ఓ బుల్డోజర్ ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం వచ్చే విధంగా ఓ ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు. రాజ్యాంగ ప్రవేశిక, బుల్డోజర్ ఫొటోలను పెట్టారు. ఈ ఆక్రమణలను తొలగించడం కోసం నగర పాలక సంస్థ అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. విద్వేషంతో కూడిన బుల్డోజర్స్‌ను ఆపాలని, పవర్ ప్లాంట్స్‌ను స్విచాన్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒవైసీ గుస్సా
ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నోటీసు, కోర్టుకెళ్లే అవకాశం లేకుండా నేరుగా పేదల ఇళ్లు కూల్చేస్తున్నారని దుయ్యబట్టారు. పేద ముస్లింలకు బతుకే లేకుండా చేస్తున్నారని ఒవైసి మండిపడ్డారు.
అమిత్ షా ఇంటికి బుల్డోజర్లు పంపితే అల్లర్లు ఆగిపోతాయి: ఆప్
బుల్డోజర్ అనే అంశాన్ని లేవనెత్తుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బిజెపిపై ధ్వజమెత్తింది. దేశ రాజధానిలో శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేందుకు బీజేపీ, అమిత్ షా కుట్ర చేస్తున్నారని ఆరోపించింది. ఈ దేశంలో అల్లర్లు ఆగిపోవాలంటే బుల్డోజర్లు బీజేపీ కేంద్ర కార్యాలయం, అమిత్ షా ఇంటికి పంపాలని దుమ్మెత్తి పోస్తున్నారు.ఆప్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయమై పోలింగ్ సైతం పెట్టారు.
ఇదేం దారుణం..! బుల్డోజర్ కు అడ్డుపడ్డ బృందా కరత్
మరోపక్క స్థానిక యంత్రాంగం చర్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి. రాజధానిలోని జహంగీర్ పురి ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ పేరిట జరుగుతున్న నిర్మాణాల కూల్చివేతను నిలిపివేయాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలు చూపిస్తూ..ఇదేం దారుణమంటూ.. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో బృందా కరత్ బుల్డోజర్లకు అడ్డుగా నిలిచారు. సుమారు 12 గంటల ప్రాంతంలో బృందా కరత్ కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేతను తక్షణమే ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునేందుకు యత్నించారు. సుప్రీం కోర్ట్ ఆర్డర్ కాపీని చూపిస్తూ కూల్చివేతను నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బృందా కరత్ మీడియాతో మాట్లాడుతూ ''బుల్డోజర్లు నిర్మాణాలను కూల్చివేయడం మేము చూశాము. వారు అన్నింటినీ సెలెక్టివ్‌గా బుల్డోజ్ చేసారు. మేము దానిని ఆపాలి. మేము దానిని ఆపిన తరువాత, ఒక సీనియర్ పోలీసు అధికారి వచ్చారు. నేను అతనితో మాట్లాడి కోర్టు ఆర్డర్‌ను అతనికి చూపించాను. అప్పుడు అతను అవును, అవును మేం ఇప్పుడు దానిని ఆపుతాం''అని అన్నారు.కూల్చివేతలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. ''వారు చట్టాన్ని సమర్థించకుండా, అధికారంలో ఉన్న పార్టీ మతతత్వ, మతపరమైన ఎజెండాను సమర్థించటానికి ప్రేరేపిస్తున్నారు'' అని ఆమె అన్నారు. ''బీజేపీ బుల్డోజింగ్, బెదిరింపు ఒక కమ్యూనిటీ మీద మాత్రమే కాదు. వీరు చట్టాన్ని బుల్డోజ్ చేస్తున్నారు. మీరు సుప్రీం కోర్ట్ ఆర్డర్ ను బుల్డోజ్ చేస్తున్నారు'' అని విమర్శించారు.