Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెల్త్ స్టార్ రేటింగ్..తీసుకురాబోతున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
- శాస్త్రీయత లేదు, పనికిరాదు : నిపుణులు
న్యూఢిల్లీ: ఆహార భద్రతా ప్రమాణాల సాధికారత సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తీరు వివాదాస్పదమైంది. నేడు మార్కెట్లో అమ్ముడుపోతున్న పలు ఆహార ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్‌పై 'హెల్త్ స్టార్ రేటింగ్' ఇవ్వాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయించింది. దీనిని త్వరలో అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఏఐ తీసుకున్న ఈ నిర్ణయంలో శాస్త్రీయత లేదని, ఆధారరహితమైనదని 40మంది ఆహారరంగ నిపుణులు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవ్యకు లేఖ రాశారు. ఈ వివాదానికి సంబంధించి ఆంగ్ల దినపత్రికల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.
ఆహార ఉత్పత్తులు, ప్యాకేజ్డ్ ఫుడ్‌పై 'హెల్త్ స్టార్ రేటింగ్' ముద్రించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 15న జరిగిన సమావేశంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయించింది. ఐఐఎం-అహ్మదాబాద్ అధ్యయనంలో పేర్కొన్న మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార ఉత్పత్తుల ప్యాకెట్ ముందుభాగంలోనే స్టార్ గుర్తులతో రేటింగ్ ఇవ్వాలని ఐఐఎం-అహ్మదాబాద్ సూచించింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లో అమల్లో ఉన్న ఈ పద్ధతిని భారత్‌లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు, అయితే అక్కడ ఈ పద్ధతేమీ సరైన ఫలితాలివ్వ లేదు..అని లేఖలో నిపుణులు పేర్కొన్నారు. స్టార్ రేటింగ్ గుర్తులు ఇవ్వటం ఆ దేశాల్లో 8 ఏండ్లుగా అమలవుతోంది, అయినప్పటికీ మంచి పోషక విలవలున్న ఆహార పదార్థాల కొనుగోలు చేయాలన్న స్పృహ వినియోగదారుల్లో పెరగలేదని లేఖలో పేర్కొన్నారు. న్యూట్రీషన్లు, శాస్త్రవేత్తలు 'హెల్త్ స్టార్ రేటింగ్' విధానాన్ని తప్పుబడుతున్నారు. ఇది మొత్తం న్యూట్రీషన్ సైన్స్పైన్నే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలగజేస్తుందని అన్నారు. కాలరీలు, కొవ్వు, చక్కెర, సోడియం వంటివి వినియోగదార్లకు తెలియకుండా స్టార్ రేటింగ్ విధానం అడ్డు వస్తుందన్నారు. ఉదాహరణకు పండ్ల జ్యూస్‌కు పోషకాల పరంగా స్టార్ రేటింగ్ ఎక్కువగా ఇవ్వొచ్చు. కానీ అందులో చక్కెర ఎంత కలిపామన్నది తెలియకుండా మరుగునపడుతుంది..అని నిపుణులు విశ్లేషించారు. అంతేగాక కొనుగోలుదార్లలో గందరగోళానికి గురిచేస్తుందని హెచ్చరించారు.