Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ ఇనిషీయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) షెడ్యూల్‌కు సంబంధించి ఈ వారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఐపీఓకు వచ్చేది ఎప్పుడు అనేది నిర్ణయం తీసుకోనున్నారని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఎల్ఐసీలో 5 శాతం వాటాలకు సమానమయ్యే 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని మోడీ ప్రభుత్వం యోచిస్తోంది. తొలుత మార్చిలోనే ఐపీఓ ఉంటుందని భావించినప్పటికీ.. ఉక్రెయిన్, రష్యా పరిణామాలకు తోడు భారత మార్కెట్లు ఒత్తిడిలో ట్రేడింగ్ కావడంతో ఐపీఓను వాయిదా వేశారు. సెబీకి సమర్పించిన పత్రాల ప్రకారం మే 12 లోపు ఐపీఓకు వెళ్లడానికి వీలుంది. ఆ తర్వాత వెళ్లాల్సి వస్తే మళ్లీ ఎల్ఐసీకి సంబంధించిన త్రైమాసిక ఫలితాలు, వాల్యుయేషన్లతో తాజా పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలు వచ్చాక ఆ వివరాలను సెబీకి మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే ఐపీఓ ఆగస్టు, సెప్టెంబర్ వరకు వాయిదా పడే అవకాశం ఉంది. రిటైల్, దేశీయ పెట్టుబడిదారుల డిమాండ్‌తో ముందుకు వెళ్లాలా..? లేక భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి, ఎఫ్ఐఐలు మార్కెట్లోకి తిరిగి రావడానికి వేచి ఉండాలా..? అన్నదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఇది సంక్లిష్టమైన సమయమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరు 30 నాటికి ఎల్ఐసీ ఎంబాడెడ్ వ్యాల్యూ (మిగులు విలువ) రూ.5.4 లక్షల కోట్లుగా లెక్కించారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితి ప్రకారం ఎల్ఐసీలో ప్రభుత్వం 5 శాతం కంటే ఎక్కువ వాటాను విక్రయించే అవకాశం లేదని అంచనా వేశారు.