Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం హెచ్చరిక
- మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసు జారీ
- కూల్చివేతకు ముందు నోటీసులిచ్చారా? లేదా?
- రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయండి
- అప్పటి వరకు యథాతథ స్థితి అమలు చేయాలి
న్యూఢిల్లీ: జహంగీర్‌పూరి కూల్చివేత డ్రైవ్ యథాతథ స్థితి కొనసాగించాలనే ఆదేశాల ఇచ్చిన తర్వాత జరిగిన కూల్చివేతలను తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీలోని జహంగీర్‌పురి, ఇతర రాష్ట్రాల్లో కూల్చివేత డ్రైవ్‌ల నిర్వహణను హైలైట్ చేస్తూ జమాతే ఉలమా ఐ హింద్, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవారులతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులకు ధర్మాసనం నోటీసు జారీ చేసింది. ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) చేపట్టాలనుకున్న జహంగీర్‌పురి కూల్చివేత డ్రైవ్‌కు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలనే ఆదేశాన్ని ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోపక్క తాము చిన్నపాటి నిర్మాణాలను మాత్రమే తొలగించామని స్థానిక యంత్రాంగం వాదించగా.. దానికి బుల్డోజర్లు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కూల్చివేతలపై మున్సిపల్ కార్పొరేషన్, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వంతో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు కూడా నోటీసులు జారీ చేసింది.
''సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత, ఎన్డీఎంసీ మేయర్‌కు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా కూల్చివేతలను మేము తీవ్రంగా పరిగణిస్తాం. మేం దానిపై చర్యలు తరువాత తీసుకుంటాం'' అని ధర్మాసనం పేర్కొంది. కూల్చివేతలకు ముందు నోటీసులు అందజేశారా? లేదా? అనే విషయాన్ని అఫిడవిట్‌పై వెల్లడించాలని పిటిషనర్లను ఆదేశించింది. ''ఈ రోజు (గురువారం) నుంచి రెండు వారాల్లో ఈ అంశాన్ని జాబితా చేస్తాం. అప్పటి వరకు యథాతథ స్థితి అమలులో కొనసాగుతుంది'' అని ధర్మాసనం పేర్కొంది.
పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో రాజ్యాంగ, జాతీయ ప్రాముఖ్యతకు సంబంధించిన సుదూర ప్రశ్నలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. కూల్చివేత డ్రైవ్ ద్వారా సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ''మేము ఉదయం 10.30 గంటలకు (బుధవారం) ప్రస్తావిస్తామని వారికి (ఎన్డీఎంసీ) తెలుసు, అందుకే కూల్చివేత ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. యథాతథ స్థితిని ఆదేశాల తర్వాత కూడా వారు కొనసాగించారు. ఇది చట్ట పాలనపై ప్రభావం చూపుతుంది. ప్రజాస్వామ్యం మిగిలి ఉండదు'' అని తెలిపారు. ''మీరు కూల్చివేసి, ఎన్డీఎంసీ కూల్చివేసిందని బీజేపీ నాయకుడు ఎలా లేఖ రాయగలరు? ఢిల్లీ మున్సిపాలిటీ చట్టంలో నోటీసు ఇవ్వాలని నిబంధన ఉంది. అప్పీళ్లకు కూడా నిబంధన ఉంది'' అని సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే అన్నారు. ''ఢిల్లీలో 731 అనధికార కాలనీలు ఉన్నాయి. 50 లక్షల మంది ఉన్నారు. మీరు ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నందున మీరు ఒకే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు?'' అని వాదనలు వినిపించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం, వ్యక్తి వాదన వినిపించడానికి సహేతుకమైన అవకాశం ఇచ్చే వరకు కూల్చివేత జరగకూడదని ఆయన గుర్తు చేశారు. ''వీరు పేదవాళ్ళు. ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులను ఉపయోగించారు. నేను ఉండే గోల్ఫ్ లింక్స్‌కి రండి. ప్రతి రెండో ఇల్లూ ఆక్రమణలే. కానీ మీరు దాన్ని అస్సలు ముట్టుకోరు'' అని తెలిపారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ దేశం అంతటా ఆక్రమణలు తీవ్రమైన సమస్య అయినప్పటికీ, అది ముస్లింలతో ముడిపడి ఉందని ఆయన అన్నారు. ''ఇతర రాష్ట్రాలలో కూడా ఇటువంటి ఉదంతాలు జరుగుతున్నాయి. ఊరేగింపులు, ఘర్షణలు జరిగినప్పుడు, ఒకే ఒక వర్గానికి చెందిన వారి ఇండ్లు బుల్డోజ్ చేయబడి ఉంటాయి. అధికారంలో ఉన్న రాజకీయాలు ఏమి జరుగాలో, ఏమి జరగకూడదో నిర్ణయిస్తార'' అని తెలిపారు. అటువంటి కూల్చివేతలపై స్టే విధించాలని సిబల్ కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ''మేం దేశంలో కూల్చివేతలను కొనసాగించడం లేదు'' అని తెలిపింది.
బృందా కరత్ తరపు సీనియర్ న్యాయవాది పివి సురేంద్రనాథ్ కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూల్చివేతలను ఆపలేదని పేర్కొన్నారు. ''ఆమె (కరత్) అధికారులకు సమాచారం అందించారు. వారు ఆగలేదు. అది 12:45 వరకు కొనసాగింది. ప్రక్రియను ఆపడానికి ఆమె భౌతికంగా నిలబడవలసి వచ్చింది'' ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కూల్చివేసిన జ్యూస్ దుకాణం యజమాని తరపున సీనియర్ న్యాయవాది సంజరు హెగ్డే వాదిస్తూ, అక్రమ కూల్చివేతకు పరిహారం ఇవ్వాలని కోరారు.
జహంగీర్‌పురిలోని ఫుట్‌పాత్‌పై ఆక్రమణలను తొలగించే కార్యక్రమం ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైందని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ''నోటీసు అవసరం లేనప్పుడు, అక్రమ నిర్మాణాలకు నోటీసు ఇచ్చిన సందర్భాలను నేను మీకు చూపిస్తాను. వ్యాపా రులు గత సంవత్సరం హైకోర్టును ఆశ్రయించారు. కూల్చివేయాలని హైకోర్టు ఆదేశించింది'' అని అతను తెలిపారు.
నోటీసు లేకుండానే స్టాళ్లు, కుర్చీలు, బల్లలు తదితరాలను తొలగించేందుకు ఎన్డీఎంసీ కమిషనర్ విచక్షణాధికారాన్ని ఉపయోగించవచ్చని ఎస్జి మెహతా పేర్కొనడంపై జస్టిస్ నాగేశ్వరరావు ప్రశ్నించారు. ''బుధవారం కూల్చివేత కేవలం స్టాళ్లు, కుర్చీలు, బల్లలు వగైరా?'' ప్రశ్నించారు. జస్టిస్ గవారు జోక్యం చేసుకొని ''వీటిని తొలగించడానికి మీకు బుల్డోజర్ కావాలా?'' ప్రశ్నించారు. అన్ని పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఇలా ఆదేశించింది. ''మేం అందజేసే నోటీసులపై పిటిషనర్ నుంచి అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయండి. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగుతుంది'' అని పేర్కొంది.