Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: జహంగీర్‌పురి కూల్చివేతకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇది ''మత రాజకీయ గేమ్ ప్లాన్'' అని పేర్కొన్నారు. నివాసితులు ''వర్ణించలేని కష్టాలు, గాయం, నష్టాన్ని'' ఎదుర్కొన్నారనీ, దీనికి ప్రతివాదులు బాధ్యులని, వారికి తగిన విధంగా పరిహారం చెల్లించాలని పిటిషన్ లో నొక్కి చెప్పారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి బృందా కరత్ పిటిషనర్ వర్సెస్ నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన కూల్చివేతలను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) దాఖలు చేశారు. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ), ఇతర ప్రతివాదుల చర్యలు అత్యంత చట్ట విరుద్ధమైనవి, అమానవీయమైనవని పేర్కొన్నారు. సహజ న్యాయం, శాసనాలు, రాజ్యాంగం సూత్రాలను ఉల్లంఘించాయని పిటిషన్ లో పేర్కొన్నారు.
''మొత్తం చర్య కచ్చితంగా, స్పష్టంగా ఏకపక్షంగా ఉంది. ఆర్టికల్ 14, 19, 21లను ఉల్లంఘిస్తోంది'' అని పిటిషన్ లో స్పష్టం చేశారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి నివాసితుల జీవనోపాధి కోసం ఉన్న ఆశ్రయం, భవనాలను కూల్చివేశారని పిటిషన్లో పేర్కొన్నారు. జహంగీర్‌పురిలో నివసిస్తున్న, పని చేసే వ్యక్తులు సాధారణంగా చాలా పేదలు, అట్టడుగున ఉన్నారని, అందువల్ల ప్రతివాదుల చర్యను ప్రతిఘటించలేరని నొక్కి చెప్పారు. కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతంలో నివసించే, పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది ముస్లింలు కాబట్టి, ముస్లిం సమాజాన్ని లక్ష్యంగా చేసుకునేందుకే కూల్చివేత డ్రైవ్ అని పిటిషన్ లో విమర్శించారు. ''ఈ ప్రాంతంలో నివసిస్తున్న, పని చేస్తున్న వారిలో ఎక్కువ మంది ముస్లిం సమాజానికి చెందినవలోని గమనించవచ్చు. ప్రతివాదులు బి, హెచ్ లతో పాటు ఇతర బ్లాకులలోని భవనాలను తాకలేదు. వారు తమ చర్యలో ఎంపిక, వివక్ష చూపుతున్నారు'' అని పిటిషన్లో పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు యథాతథంగా ఆదేశించినప్పటికీ కూల్చివేత డ్రైవ్ బుధవారం కొనసాగిందని కూడా పిటిషన్ లో హైలైట్ చేశారు. ఆక్రమణలను తొలగించే ముసుగులో వివక్షతతో కూడిన, ఏకపక్ష కూల్చివేత డ్రైవ్ ''మత రాజకీయ గేమ్ ప్లాన్'' వలె నిర్వహించబడుతుందని పిటిషన్ లో పేర్కొన్నారు. ''ప్రతివాది 1 మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ కార్యనిర్వాహకుడు దురుద్దేశపూర్వకంగా రాజకీయ గేమ్ ప్లాన్‌లో పాల్గొంటున్నారు'' అని పేర్కొన్నారు. ''కూల్చివేత చర్య సహజ న్యాయ సూత్రాలు, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం-1957, రాజ్యాంగంలోని చట్టబద్ధమైన నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించింది. అంతేకాకుండా, ఇది ఎటువంటి చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించకుండా ఉంది'' అని పిటిషన్ లో తెలిపారు. కాబట్టి, ఎన్డీఎంసీ జారీ చేసిన లేఖను రద్దు చేయాలని, ఎటువంటి చర్య తీసుకోవద్దని ప్రతివాదులను ఆదేశించాలని, అక్రమ కూల్చివేత బాధితులకు పరిహారం మంజూరు చేయాలని బృందా కరత్ కోర్టును కోరారు. ఈ పిటిషన్‌ను న్యాయవాది సుభాష్ చంద్రన్ కెఆర్ డ్రాఫ్ట్ చేయగా, న్యాయవాది బిజు పి రామన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.