Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన వేతనాలు.. నిరుద్యోగం.. ధరల పెరుగుదల
- తగ్గిన డిమాండ్.. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
- మోడీ సర్కారు తీరుపై విశ్లేషకులు, నిపుణుల ఆందోళన
న్యూఢిల్లీ : మోడీ పాలనలో భారత్‌లో గ్రామీణ ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఇక్కడ ప్రజల వేతనాల్లో తగ్గుదల కనిపించింది. నిరుద్యోగం పెరిగిపోయి తీవ్ర సమస్యగా పరిణమించింది. ఆహార, నిత్యవసర ధరలు పెరిగిపోయి పూట గడవటమే కష్టంగా మారింది. ఈ సమస్యలు యావత్భారతాన్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా, మోడీ ప్రభుత్వ చర్యల కారణంగా గ్రామీణ భారతం ఈ సమస్యలకు అడ్డాగా మారింది. వాటి కష్టాలను అక్కడి ప్రజలు ఎదుర్కొంటూ క్షోభను అనుభవిస్తున్నారు. ఇదే విషయాన్ని దేశంలోని అనేక కంపెనీలు, సంస్థలు, పరిశోధకులు, నిపుణులు తెలిపారు. కేంద్రం ఈ సమస్యపై దృష్టిని సారించాలని వారు సూచించారు. మోడీ సర్కారు అనుసరిస్తున్న తీరు పట్ల విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ భారత్‌లో డిమాండ్ తగ్గిపోయింది. ద్రవ్యోల్బణం పెరిగింది. అసమనాతలు ఎక్కువయ్యాయని కొందరు నిపుణులు చెప్పారు. వాస్తవానికి కరోనా సెకండ్‌వేవ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్కు చెందిన ఆనంద్ వెంకటేశ్ అన్నారు. '' నిరుద్యోగం విస్తరిస్తున్నది. రివర్స్మైగ్రేషన్ ఇప్పటికే దెబ్బతిన్న గ్రామీణ ప్రజల బడ్జెట్‌కు చిల్లును పెట్టింది. అయితే, సమస్యలు సద్దుమణగటానికి కొంత సమయం అవసరం'' అని తెలిపారు.
గత పరిస్థితుల నుంచి నేర్వని పాఠాలు
కరోనా సమయానికి ముందు, మహమ్మారి సమయంలోనూ గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పలు సంస్థలు, ఆర్థిక నిపుణుల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే, గత పరిస్థితుల నుంచి పాఠాలు నేర్వకపోవటం, హెచ్చరికలను బేఖాతరు చేయడంతో అది ప్రస్తుత పరిస్థితికి దారి తీసిందని విశ్లేషకులు చెప్పారు. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆదాయంపై ప్రభావం పడిందని వివరించారు. అయితే, ఆదాయం పడిపోయిన కారణంగా గ్రామీణ భారతంలో డిమాండ్ పడిపోలేదని బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ తెలిపారు. ద్రవ్యోల్బణ ఒత్తిడులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌కు అంతరాయాన్ని కలిగించిందని విశ్లేషకులు చెప్పారు. '' రివర్స్ మైగ్రేషన్‌తో గ్రామీణ భారతం గతేడాది కొద్ది కాలం పాటు వృద్ధిని నమోదు చేసింది. అయితే, కొద్ది కాలంలోనే గ్రామీణ వినియోగదారులు ఆదాయ, లిక్విడిటీ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది వినియోగంపై ప్రభావాన్ని చూపుతుంది'' అని కోల్గేట్-పాల్మొలివ్ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ రాఘవన్ అన్నారు.
బలహీనపడిన ఆటోమొబైల్ సెక్టార్
ఇటు గ్రామీణ భారత్‌లో ఆటోమొబైల్ సెక్టార్ కూడా బలహీనపడింది. సీఎస్ఓ, ఆర్బీఐ వంటి పలు విశ్వసనీయ సంస్థల సమచారం ప్రకారం.. కార్ల రిటైల్స్ 2021..22 ఆర్థిక సంవత్సరంలో ఏడు శాతం అంతకు ముందు ఏడాది కంటే పెరుగుదలను నమోదు చేసింది. ద్విచక్రవాహన విభాగంలో సగం వరకు ద్విచక్ర వాహనాలు గ్రామీణ ప్రాంతాల్లోనే అమ్ముడయ్యాయి.
ద్రవ్యోల్బణం ప్రభావం
దేశంలో ద్రవ్యోల్బణం 17నెలల గరిష్టానికి చేరి 6.95 శాతంగా నమోదైంది. గ్రామీణ భారతంలో మాత్రం ఆహార ధర ద్రవ్యోల్బణం రెట్టింపుకు పైగా రికార్డయ్యింది. 2021 మార్చిలో ఇది 3.94 శాతంగా ఉన్నది. అయితే, 2022 మార్చి నాటికి మాత్రం అది ఏకంగా 8.04 శాతానికి చేరుకోవడం గమనార్హం. ద్రవ్యోల్బణ అధిక రేట్లు అనేవి గ్రామీణ భారతంలో కొనుగోలు శక్తిని తగ్గింపజేయడానికీ, పొదులను క్షీణింపజేయడానికి దారి తీసిందని ఇండిపెండెంట్ రీసెర్చర్, ఐసీఆర్ఐఈఆర్ సీనియర్ కన్సల్టెంట్ శ్వేతా సైనీ అన్నారు. అయితే, పెరుగుతున్న వ్యవసాయ ధరలు, సహకరిస్తున్న ప్రపంచ అంశాలు.. గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా రైతులు చక్కగా సంపాదించగలరని ఆశించొచ్చని తెలిపారు.
సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదలకు తోడ్పాటునందిస్తుందన్నది భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అంచనా. అయితే, విశ్లేషకులు మాత్రం ఈ విషయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ద్రవ్యోబల్బణం కొనసాగి అలాగే ఉంటుందని వారు విశ్లేషించారు. వంట నూనెలు, పౌల్ట్రీ ఫుడ్ వంటి ఆహార వస్తువుల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయని చెప్పారు.
నిరుద్యోగం ఆందోళనకరం
భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో గ్రామీణ భారతం వాటా కీలకం. ఇందులో శ్రామిక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. బెయిన్ అండ్ కంపెనీ సమచారం ప్రకారం.. 2019-20 ఏడాదిలో మొత్తం జీడీపీలో దాదాపు సగం వరకు గ్రామీణ భారతం వాటా ఉన్నది. 35 కోట్ల మంది ఇందులో భాగస్వామ్యమ్యం కావటం గమనార్హం. ముఖ్యంగా, వ్యవసాయం వాటా జీడీపీలో 37 శాతం వరకు ఉన్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ) సమాచారం ప్రకారం.. భారత్‌లో నిరుద్యోగం మార్చిలో 7.29 శాతంగా ఉన్నది. ఫిబ్రవరిలో ఇది 8.35 శాతంతో ఎనిమిది నెలల గరిష్టానికి చేరిన విషయం విదితమే.
'ఉపాధి హామీ'కి డిమాండ్
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) పథకానికి డిమాండ్ పెరిగింది. కరోనా కాలంలో ఇది గ్రామీణ ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆసరానిచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం కింద ఉపాధిని పొందే వారి సంఖ్య ఇప్పటికే తొమ్మిది కోట్లకు చేరిందని మోతీలాల్ ఓస్వాల్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) తన విశ్లేషణలో తెలిపింది. అయినప్పటికీ, ఈ పథకాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నదని విశ్లేషకులు తెలిపారు. 2023 ఆర్థిక సంవత్సరానికి గానూ గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ పథకానికి కేంద్రం తక్కువ నిధులన కేటాయించటాన్ని వారు ఉటంకించారు. 2021..22 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్రం రూ. 98 వేల కోట్లను ఈ పథకానికి కేటాయించిన విషయం విదితమే. అది 2022..23 ఆర్థిక సంవత్సరానికి మాత్రం రూ. 73 వేల కోట్లకు పడిపోవటం గమనించాల్సిన అంశం.
వేతనాల వ్యధ:ఇటు వేతనాల అంశమూ కలవరపెడుతున్నది. 2019 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామీణ భారతంలోని ప్రజలకు తగిన వేతనాలు దక్కటం లేదని విశ్లేషకులు వివరించారు. ఇందుకు కొన్ని విశ్వసనీయ గణాంకాలను వారు ఉటంకించారు. వ్యవసాయ, వ్యవసాయేతర పనుల్లో వేతనాలను పోలుస్తు ఈ తగ్గుదలను వారు చూపించారు. ఈ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆదాయాలు తగ్గిపోవటానికి కారణమవుతున్నాయన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాలని విశ్లేషకులు సూచించారు. లేకపోతే, ఇది దేశ ఆర్థి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందన్నారు.