Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం
చెన్నై : దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. ఇప్పటికే దేశరాజధాని ఢిల్లీలో కరోనా వ్యాప్తి పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి కోవిడ్ నిబంధనల్ని అమలు చేయనున్నది. రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనీ, మాస్క్ ధరించనివారికి రూ.500 జరిమానా విధించనున్నట్టు ఆరోగ్యమంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. ఇక ఆ రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే కొత్తగా 39 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 34,53,390కి చేరాయి. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 38,025మంది కరోనాకు బలయ్యారు. అయితే గడచిన 24 గంటల్లో కరోనాతో ఎవరూ మృతి చెందలేదని ఆరోగ్య మంత్రత్వశాఖ వెల్లడించింది. కాగా, రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖా కార్యదర్శి జె. రాధాకష్ణన్ మాట్లాడుతూ.. 'ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల సడలింపును ప్రకటించలేదు. ప్రజలందరూ అప్రమత్తతతో లేకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరోసారి కరోనా కేసులు పెరుగుతాయి. దీనికి ఉదాహరణగా ఢిల్లీనే చెప్పుకోవచ్చు. అక్కడ ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల బుధవారం కరోనా కేసులు పెరిగాయి. కోవిడ్ నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తేనే కరోనా వ్యాప్తిని అరికట్టగలం. రోజువారీగా నమూనా పరీక్షలు 16 నుంచి 18 వేల నమూనాలనే పరీక్షించడం జరుగుతోంది. దీన్ని రాబోయే రోజుల్లో 25 వేలకు పెంచాలనే యోచనలో ఉన్నాం' అని ఆయన అన్నారు.