Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం, ప్రాంతం, భాష, కులం పేరుతో విద్వేషాన్నివెళ్లగక్కుతున్నాయి
- అందువల్లే మోడీ సర్కార్‌పై అన్ని వర్గాలూ ఉద్యమిస్తున్నాయి..
- ధరల పెరుగుదలతో సామాన్యుడు విలవిల : సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత
- చండీగఢ్‌లో సీఐటీయూ వర్కింగ్ కమిటీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : మతం, ప్రాంతం, భాష, కులం..పేరుతో అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్ విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నాయని సీఐటీయూ అధ్యక్షురాలు హేమలత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర పోరాటం దేశ ప్రజలందర్నీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందని, అలాంటి స్వాతంత్ర పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు ఎలాంటి పాత్రా లేదని ఆమె చెప్పారు. మోడీ సర్కార్ విధానాలపై కార్మికులు, కర్షకలు మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలూ ఆందోళనకు దిగుతున్నాయని తెలిపారు. శుక్రవారం చండీగఢ్‌లో సీఐటీయూ వర్కింగ్ కమిటీ మూడు రోజుల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశానికి హాజరైన నాయకులను ఉద్దేశించి ఆమె అధ్యక్షోపన్యాసం చేశారు. ప్రధాన కార్యదర్శి నివేదికను సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ సమావేశంలో సభ్యుల ముందు ప్రవేశపెట్టారు.
ఈ నివేదికపై వర్కింగ్ కమిటీ సభ్యులంతా మూడు రోజుల పాటు చర్చిస్తారు. కె.ఎన్.ఉమేష్ ప్రవేశపెట్టిన 'కార్మికుల ఐక్యత : మత విభజనను ఓడించాలి' అనే తీర్మానాన్ని ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. 'ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ వర్కింగ్ వుమెన్' 12వ జాతీయ సదస్సు మే 21, 22న కోల్‌కతాలో నిర్వహించాలని ప్లీనరీ నిర్ణయించింది.
కేంద్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం : హేమలత
కేంద్రంలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాల్ని అనుసరిస్తోంది. మతం, కులం, ప్రాంతం, భాష, వేషధారణ..పేరుతో ప్రజల్లో విద్వేషాన్ని నింపుతోంది. హిజాబ్ వివాదం, హలాల్, హిందూ దేవాలయాల వద్ద ముస్లిం వ్యాపారుల పట్ల వివక్ష..వంటివి కర్నాటకలో ప్రత్యక్షంగా చూస్తున్నాం. 'కాశ్మీర్ ఫైల్స్' పేరుతో ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని ఎగదోస్తోంది. అనేక రాష్ట్రాల్లో రామనవమి సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇతర నిత్యావసర సరుకులు కొనలేని స్థాయికి చేరుకున్నాయి. పాలకుల తీరుపై ప్రజలంతా రగిలిపోతున్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికి పలు రాష్ట్రాల్లో మతఉద్రిక్తతలు, ఘర్షణలకు రేపుతోంది. కోట్లాది మంది యువతను నిరుద్యోగ సమస్య వేధిస్తోంది.
విచ్ఛినకర శక్తుల్ని ఓడించాలి..
కార్మిక సంఘాలు బలపడటంపై ప్రస్తుత సమావేశాల్లో చర్చించనున్నాం. సభ్యత్వం పెంచుకొవాలని, ఆర్గనైజేషన్ సామర్థ్యం పెంపుపైనా దృష్టిసారించాం. కార్మికలోకం ఒక్కటైతేనే దేశం ముందున్న సవాళ్లను ఎదుర్కోగలం. ప్రస్తుతం కేంద్రంలో మోడీ సర్కార్ విధానాల్ని ఓడించాల్సిన అవసరముంది. ఈ నినాదం కేవలం కార్మికవర్గాలదే కాదు, కర్షకులు, ఉద్యోగులు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాలది.