Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు క్లోజ్
- చదువు మానేసి.. నగరాల్లో కూలీలుగా బాలలు
- కేంద్రం చర్యతో పెరిగిన బాల కార్మికులు
- ఎస్ఎస్ఏతో ముందుకెళ్లాలంటున్న కేంద్రం
- మోడీ సర్కారు తీరును తప్పుబట్టిన విద్యావేత్తలు, నిపుణులు
పిల్లల బాల్యం క్రీడలు, ప్రాథమిక విద్యలో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. కానీ, ఆ బాల్యాన్ని కోల్పోయిన పిల్లలు దేశంలో చాలా మంది ఉన్నారు. పేదరికం కారణంగా వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి తక్కువ వేతనాలతో పని చేయాల్సి వస్తున్నది. దీంతో వారు.. చిరకాలం గుర్తుండాల్సిన చిన్ననాటి మధుర స్మృతులకు దూరమవుతున్నారు. బాలకార్మికులుగా స్థిరపడుతున్నారు.
న్యూఢిల్లీ : దేశంలోని అనేక ప్రభుత్వాలు పేద పిల్లలను పనికి బదులు బడులకు పంపడానికి పలు విధానాలు, ప్రాజెక్టులతో ముందుకు వచ్చాయి. వీటిలో ఒకటి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్సీఎల్పీ).అయితే, ప్రస్తుత మోడీ సర్కారు హయాంలో దేశంలో ఈ ఎన్సీఎల్పీ అమలు విషయం ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది మార్చి 31 తర్వాత ఎన్సీఎల్పీ అమలు చేయబడదని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్సీఎల్పీ అనేది కేంద్రం నిర్వహించే సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో చేర్చబడుతుందని చెప్పింది. ఈ విషయాన్ని గత నెలలోనే దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అకస్మాత్తుగా తెలియజేసింది. అయితే, ఇందుకు గల కారణాన్ని మాత్రం కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించకపోవడం గమనార్హం.
నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు అంటే ఏమిటీ?
బాల కార్మికుల (నిషేదం మరియు నియంత్రణ) చట్టం (సీఎల్పీఆర్ఏ) 1986లో ఆమోదించబడింది. ఇది తొమ్మిది నుంచి 14 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలను ప్రమాదకర వృత్తులలో పని చేయకుండా నిషేధించింది. ఇది పిల్లల విద్యను కొనసాగించేలా గృహ-ఆధారిత పరిశ్రమలు లేదా వ్యవసాయం వంటి ఇతర వృత్తులలో పని చేసేలా నియంత్రించింది. ఒక రకంగా చెప్పాలంటే, దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక విద్యను తప్పనిసరి చేస్తూ సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) చట్టానికి ఇది పూర్వగామి అని చెప్పొచ్చు. అయితే, 1998లో, సీఎల్పీఆర్ఏను సమర్థవంతంగా అమలు చేయడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టును ప్రారంభించింది.
దేశంలో పెద్ద సంఖ్యలో పిల్లలు పని చేస్తున్న తమిళనాడులోని శివకాశి వంటి 12 బాల కార్మికుల హాట్స్పాట్లను గుర్తించారు. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిధులతో ఈ జిల్లాల్లో ఎన్సీఎల్పీ ప్రారంభించబడింది. ఎన్సీఎల్పీ కింద తొమ్మిది నుంచి 14 ఏండ్ల వయస్సు గల పిల్లలను ప్రమాదకర పని నుంచి రక్షించారు. వారి వయస్సుకు అనుగుణంగా పాఠశాలల్లో చేర్చారు. పాఠశాల విద్యను తట్టుకోలేని వారికి సహాయం చేయడానికి 2001 నుంచి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు (ఎస్టీసీ) ఏర్పాటయ్యాయి. బాల కార్మిక వ్యవస్థ నుంచి విడుదలైన ప్రతి చిన్నారికీ మొదట్లో నెలకు రూ. 100 పరిహారంగా అందించారు. తర్వాత కార్మిక మంత్రిత్వ శాఖ ఈ మొత్తాన్ని రూ. 400కి పెంచింది.
తమిళనాడు వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పునరావాసం పొందిన పిల్లలకు నెలకు రూ. 400 వరకు ఇచ్చాయి. ఇక్కడ 18 జిల్లాల్లో పథకం అమలులో ఉన్నది. ఈ జిల్లాల్లోని 213 ప్రత్యేక శిక్షణా కేంద్రాలలో మూడువేల మందికి పైగా పిల్లలు చదువుకున్నారు. యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్‌గా ఉన్న ఆర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు రద్దు చేయబడిన తర్వాత బాల కార్మిక వ్యవస్థను తొలగించటం అసాధ్యమన్నారు.
కేంద్రం నుంచి ఆగిన గ్రాంట్
ఎస్ఎస్ఏ ద్వారా రాష్ట్రాలు బాల కార్మికులను కాపాడి ప్రధాన స్రవంతిలో కొనసాగించవ్చని కేంద్రం తెలిపింది. అయితే, కేంద్ర ప్రభుత్వంత ఇస్తున్న గ్రాంట్ ఆగిపోవడంతో పిల్లలకు స్టైఫండ్, ఉపాధ్యాయులకు జీతాలు ఆగిపోయాయి. గత కొన్నేండ్లుగా తమిళనాడులోని బాల కార్మికుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఎన్సీఎల్పీ మూసివేత తర్వాత ఈ పిల్లలు ఎస్ఎస్ఏ ద్వారా లేబర్‌ను వదిలి చదువు వైపునకు వస్తారా? అని విద్యావేత్తలు, నిపుణులు, విశ్లేషకులు ప్రశ్నించారు. మోడీ సర్కారు చర్యను వారు తప్పుబట్టారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా పేద కుటుంబాల నుంచి ఎక్కువ మంది పిల్లలు చదువు మానేసి నగరాల్లో కూలీలుగా మారిన పరిస్థితిలో ఎన్సీఎల్పీని విస్తరించాల్సినవసరం ఉన్నదని తెలిపారు. ఇక ఎన్సీఎల్పీకి కూడా కేంద్రం బడ్జెట్లో కోతలు విధించింది. 2019 నుంచి క్రమంగా ఈ ప్రాజెక్టుకు చేసే కేటాయింపులను మోడీ ప్రభుత్వం తగ్గిస్తూ వచ్చింది. 2019-20, 2020-21 బడ్జెట్లో రూ. 77.48 కోట్ల చొప్పున ఎన్సీఎల్పీ కి బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. అయితే, 2021-22లో అది రూ. 30 కోట్లకు పడిపోవటం గమనార్హం.