Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కల్పన, రుణ మంజూరుపై మరింత కసరత్తు చేయాలి
- : ఐఎంఎఫ్ భారత్ వృద్ధి బాట పట్టాలంటే
న్యూఢిల్లీ : భారత్ వృద్ధిబాట పట్టాలంటే ఉపాధి కల్పన, రుణాల మంజూరు, కార్మికశక్తి అత్యంత కీలకమైనవని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మిషన్-ఇండియా చీఫ్ నాద చౌరీ అన్నారు. కరోనా సంక్షోభం కారణంగా రెండేండ్ల వృద్ధి కోల్పోయామని, భారత్‌లో వివిధ రంగాలు ఇంకా వృద్ధిబాట పట్టాల్సి వుందని ఆమె చెప్పారు. జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..''రాబోయే ఐదేండ్లలో దక్షిణాసియా దేశాల జీడీపీ 7శాతం ఉంటుందని ఇంతకు ముందు అంచనావేశాం. కానీ అది 6.2శాతానికి పరిమితమవుతుందని భావిస్తున్నాం. ఆర్థికరంగంలో సంస్కరణలు తీసుకొస్తే వృద్ధి వేగవంతం అవుతుంది. రుణాల లభ్యత, లేబర్ మార్కెట్ మెరుగుపడాలి. ఉపాధి కల్పన పెరగాలి. దాంతో కార్మికశక్తిలో ప్రాతినిథ్యం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి గాడిలో పడాలంటే క్యాపిటల్, లేబర్ రెండూ ముఖ్యమైనవే''అని చెప్పారు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత్ 9శాతం వృద్ధి నమోదుచేస్తుందని ఈ ఏడాది జనవరిలో ఐఎంఎఫ్ అంచనావేసింది. ఈ అంచనాల్ని తాజాగా సవరించింది. జీడీపీ వృద్ధి 8.2శాతం ఉండొచ్చునని తెలిపింది. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సరుకుల పంపిణీ వ్యవస్థ కూడా గందరగోళంగా తయారైంది. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఏడాదికల్లా వృద్ధి 6.9శాతానికి పరిమితవుతుందని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది. దీనిపై నాద చౌరీ మాట్లాడుతూ..''కోవిడ్‌తో దెబ్బతిన్నా భారత్ వృద్ధి బాట పట్టే అవకాశాలున్నాయి. సంక్షోభం సమయంలోనూ అత్యంత వేగంగా విస్తరించే ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. నిత్యావసర సరకుల ధరలు 6.1శాతం పెరిగాయి. కేంద్ర బ్యాంకులు అంచనావేసిన దానికన్నా ఇది ఎక్కువగా ఉంది. ధరల పెరుగుదలకు అనుకూలంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉన్నాయి. ఇది వృద్ధి మెరుగుదలకు మద్దతు ఇవ్వదు'' అని చెప్పారు. ఏది ఏమైనా ఆర్బీఐ కచ్చితమైన గణాంకాల్ని ఆధారంగా చేసుకోవాల్సి వుంటుందని, మార్కెట్‌పై ఆర్బీఐ విధానాల ప్రభావం ఏమేరకు అన్నది పరిశీలించుకోవాలని ఆమె సూచించారు. ద్రవ్యలోటును తగ్గించుకోవటంపై మరింత దృష్టిసారించాల్సి వుందన్నారు.