Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంటీ మైనారిటీ ఇమేజ్‌తో భారత కంపెనీలకు దెబ్బ
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశంలోని ప్రస్తుత పరిస్థితులు మార్కెట్లో అవి భారత్‌పై ఎలా ప్రభావం చూపుతాయన్న దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. దేశానికి యాంటీ మైనారిటీ ఇమేజ్ రావడం కారణంగా భారత ఉత్పత్తులకు మార్కెట్లో నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి ఇమేజ్ వల్ల భారత్ విశ్వసనీయ భాగస్వామి కాదని విదేశీ ప్రభుత్వాలు భావించే అవకాశమున్నదన్నారు. టైమ్స్ నెట్వర్క్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. భారత్ పేద దేశమనీ, ప్రజలందరినీ గౌరవించే ప్రజాస్వామిక దేశమని ఇతరులు భావించినప్పుడు మనకు ఎక్కువ సానుభూతి దొరుకుతుందని రాజన్ అన్నారు. మంచిపని చేయడానికి ప్రయత్నించే దేశం నుంచి నేను ఈ వస్తువును కొంటున్నానని వినియోగదారుడు భావించినప్పుడు భారత మార్కెట్లు వృద్ధి చెందుతాయని చెప్పారు. మైనారిటీలను ఏ విధంగా చూస్తున్నారనేదానిపై ఆధారపడి విదేశీ ప్రభుత్వాలు ఒక దేశం నమ్మదగిన భాగస్వామా? కాదా? అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. సేవారంగంలో భారతీయులకు చక్కని అవకాశాలున్నాయనీ, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వంటి రాజ్యాంగ వ్యవస్థలను అణగదొక్కడం భారత ప్రజాస్వామిక లక్షణం క్రమంగా నశిస్తుందని హెచ్చరించారు. గోప్యతపై విదేశాల సున్నిత భావాల పట్ల మనం జాగ్రత్తగా వ్యవహరించాలని రాజన్ చెప్పారు.