Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక భద్రతా సిబ్బంది, ఇద్దరు ఉగ్రవాదులు మృతి
- తొమ్మిది మందికి గాయాలు
జమ్ము : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ముకాశ్మీర్‌లో ఆదివారం పర్యటించనున్న నేపథ్యంలో శుక్రవారం జమ్ము ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. జమ్ము శివారులోని ఒక ఆర్మీ క్యాంప్‌కు సమీపంలో కేంద్ర పారిశ్రామిక భద్రత బలగాలు (సిఐఎస్ఎఫ్)కు చెందిన బస్సును లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున 4:25 గంటలకు జరిగిన ఈ ఘటనలో సిఐఎస్ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. తొమ్మిది సిఐఎస్ఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. కాల్పులు జరుపుతూ, గ్రెనేడ్లు విసురుతూ ఉగ్రవాదులు బస్సుపై దాడికి పాల్పడ్డారని పారామిలటరీకి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో 15 మంది భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్నారు. వారు వెంటనే అప్రమత్తమై ఎదురుదాడి ప్రారంభించారు. జమ్ములో అత్యంత భద్రత ఉండే సుంజవాన్ ప్రాంతంలోని చద్దా క్యాంప్ వద్ద ఈ దాడి జరగడం సంచలనంగా మారింది. జమ్ములో ఉగ్రదాడి జరగొచ్చని సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలోనే దాడి జరిగింది. మరణించిన ఉగ్రవాదులను జైషే మహమ్మద్ గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నారు.
దాడి చేసిన ఉగ్రవాదులను సమీపంలో ఒక ఇంటిలో హతమార్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఆచూకి కోసం డ్రోన్లతో ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నారు. మృతిచెందిన సిఐఎస్ఎఫ్ అధికారిని ఎస్పి పాటిల్‌గా గుర్తించారు. 2019 ఆగస్టులో 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన తరువాత తొలిసారిగా జమ్ముకాశ్మీర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించనున్నారు. ఈ నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సాంబా జిల్లా పల్లీ గ్రామంలో సభలో మోడీ పాల్గొననున్నారు.