Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ మరణాల సంఖ్యపై గణిత శాస్త్రజ్ఞుడు బనాజీ
న్యూఢిల్లీ : కోవిడ్ మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం తక్కువచేసి చూపిస్తున్నదని డాక్టర్ మురాద్ బనాజీ ఆరోపించారు. లండన్‌కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు బనాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'భారతదేశంలో ఇప్పటివరకు 5.22 లక్షలకు పైగా కోవిడ్ మరణాలు సంభవించాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే భారత్‌లో అధికారిక లెక్కల కంటే.. ఇంకా ఎక్కువే కోవిడ్ మరణాలు సంభవించి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేసింది. అలాగే ప్రభుత్వం చెబుతున్న లెక్కలు తప్పనీ, ఆరు వేర్వేరు అధ్యయనాలు కూడా ధ్రువీకరించాయి. ఈ విషయాన్ని భారత్ అంగీకరించడం లేదు. కోవిడ్ మరణాల్ని నిరాకరించడం సైన్సు పట్ల ప్రభుత్వానికున్న అవగాహనను తెలియజేస్తోంది. ఇది తిరోగమనానికి సూచికగా ఉంది. ముఖ్యంగా కోవిడ్ మరణాల సంఖ్యను తక్కువగా లెక్కించడం భారతదేశ ప్రతిష్టకు మంచిది కాదు' అని అన్నారు.
ఇక కరోనా మృతుల సంఖ్యపై ప్రభుత్వ వాదనలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు ఒకేరీతిగా ఉండదని.. ఈ లెక్కలు మోడలింగ్ తరహాగా పరిగణించలేదని ప్రభుత్వం చెబుతున్నది.
దీనికి ఆయన స్పందిస్తూ.. ప్రభుత్వం చెప్పే లెక్కలు, వాదనలు అంతా గందరగోళంగా ఉన్నాయి. జూన్ 2021లో పాజిటివిటీ రేటు 68 శాతంగా ఉంది. ఇది ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన దానికంటే పెద్ద సంఖ్యలో కేసులను సూచిస్తున్నది. అందువల్ల చాలా పెద్ద సంఖ్యలోనే మరణాలు సంభవించి ఉంటాయి అని ఆయన అన్నారు. అలాగే భారత్‌లో కోవిడ్ మరణాల గణాంకాల విషయంలో డబ్ల్యూహెచ్ఓ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.