Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిచ్చు రేపుతున్న హిందూత్వ గ్రూపులు
- మతం పేరుతో ప్రజల మెదళ్లలో విషాన్ని నింపుతున్న వైనం
- హిందూయేతర వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ పోస్టులు
- పరోక్షంగా ఆరెస్సెస్, బీజేపీకి అనుకూలంగా ప్రచారాలు
- తెలంగాణలో పెరుగుతున్న ఇలాంటి ధోరణి
దేశంలో హిందూత్వ గ్రూపుల 'విషప్రచారం' ఆన్లైన్ వేదికగా విస్తృతంగా సాగుతున్నది. 'మతం' పేరుతో ప్రజల మెదళ్లలో 'విద్వేషపు' సమాచారాన్ని చొప్పిస్తున్నాయి. సున్నితమైన అంశాలతో ప్రజలలో భావోద్వేగాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయి. ఇందుకోసం ఫేస్బుక్, వాట్సప్‌లలో ప్రత్యేక పేజీలు, గ్రూపులు, యూట్యూబ్ చానెళ్లను హిందూత్వ గ్రూపులు సృష్టించాయని విశ్లేషకులు తెలిపారు. వాటి ద్వారా తమ కార్యకలాపాలను గత కొంతకాలంగా కొనసాగిస్తున్నాయన్నారు.
న్యూఢిల్లీ : హిందూయేతర వర్గాలను లక్ష్యంగా చేసుకుంటూ విషాన్ని చిమ్ముతున్నాయని చెప్పారు. ''మతం ఆధారంగా ప్రజలలో విభజనను తీసుకొస్తున్నాయి. పరోక్షంగా ఈ హిందూత్వ గ్రూపుల ప్రచారం ఆరెస్సెస్ అజెండాకు, బీజేపీకి అనుకూలంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా, ఇలాంటి ధోరణి తెలంగాణలో తీవ్రమైంది'' అని విశ్లేషకులు తెలిపారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే కర్నాటక వంటి పరిస్థితులే ఇక్కడ ప్రారంభయ్యే ప్రమాదమున్నదని హెచ్చరించారు.
''నేను తొలుత ఆరెస్సెస్‌కు అనుబంధంగా పని చేశాను. 2018లో తెలంగాణలో దళిత యువకుడు, అగ్రకుల అమ్మాయిని పెండ్లి చేసుకొన్ని హత్యకు గురైన విషయం విదితమే. అయితే, ఆ ఘటనకు సంబంధించి ఆరెస్సెస్, హిందూత్వ గ్రూపుల వైఖరి సదరు సంస్థతో పని చేయడంపై నన్ను ఆలోచింపజేసింది. కుల వివక్ష ఉండకూడదు. మనమంతా హిందువులం అంటూ ఆరెస్సెస్ చెప్పేది. కానీ, ఆ ఘటనలో జరిగిన హత్యను కులం ఆధారంగా సంస్థ సమర్థించింది. దీంతో ఆరెస్సెస్‌పై నా నమ్మకం చెదిరింది. క్రమంగా వారికి దూరమయ్యాను. వారి విద్వేష వాదనల గురించి ఇప్పుడు అర్థం చేసుకున్నాను'' అని శ్రీకుమార్ అనే టెకీ తెలిపాడు. సున్నితమైన అంశాలను సీరియస్‌గా తీసుకొని హిందూత్వ సంస్థలు వేసే ఉచ్చులో శ్రీకుమార్ వంటి యువకులు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా చాలా మంది ఉన్నారని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. అయితే, వారు కూడా శ్రీకుమార్ లాగే వాస్తవాలను తెలుసుకుంటారని చెప్పారు.
తెలంగాణలో మైనారిటీ వర్గాలు, ఇక్కడి ప్రభుత్వాన్ని 'హిందూఫోబిక్'గా అభివర్ణిస్తూ విద్వేషాన్ని చిమ్ముతున్న ఇలాంటి కొన్ని పేజీలకు సంబంధించిన స్వరూపం ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో బహిర్గతమైంది. మార్చి 20న నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు అంశం అక్కడ టెన్షన్‌ను పుట్టించిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండానే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ కార్యకర్తలు, హిందూత్వ నాయకులు ప్రయత్నించారు. అయితే, ఈ విషయానికి సంబంధించి ఇక్కడి అధికార టీఆర్ఎస్, విపక్షం ఏఐఎంఐఎం కు వ్యతిరేకంగా హిందూత్వ గ్రూపులు, పేజీలు, చానెళ్లు రెచ్చగొట్టే విషపు రాతలను, వీడియోలను ప్రచారం చేశాయి.
ఫేస్బుక్ పేజీ 'ధర్మధ్వజం-హిందూ చైతన్య వేదిక' అనే హిందూత్వ గ్రూపునకు 50 వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వర్గం వారు శివాజీ విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారని వివాదాస్పద వార్తను ప్రచారం చేసింది. 'టిప్పుుసుల్తాన్ విగ్రహాన్ని కూడా పెడతామనీ లేకుంటే శివాజీ విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుంటాం' అని ఆ వర్గం వారు డిమాండ్ చేశారంటూ కొన్ని రెచ్చగొట్టే ఫోటోలతో పోస్టును ఒక హిందూత్వ నాయకుడు షేర్ చేశాడు. 'కాంట్రవర్సీ కుర్రాడు' అనే పేజీలో కూడా 'ఆ వర్గాన్ని' లక్ష్యంగా చేసుకుంటూ తర్వాతి రోజు పోస్టులు వెలువడ్డాయి. 'ట్రోల్ హిపోక్రైట్స్', 'కాంట్రవర్సీ కుర్రాడు', 'ధర్మధ్వజం-హిందూ చైతన్య వేదిక' వంటి హిందూత్వ పేజీలు తెలుగులో క్రియాశీలంగా ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు.
'ఆ వర్గం' వేధింపులు, కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ప్రచారం, బీజేపీ చేసే విష ప్రచారంపై మాట్లాడే తెలంగాణ సీఎంపై ట్రోల్స్ వంటివి ఈ పేజీలు ప్రచారం చేశాయి. ఇలాంటి పేజీలు ఆన్లైన్లో ఇంకా చాలా ఉన్నాయనీ, ఇవి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు, ముఖ్యంగా యువతను రెచ్చగొట్టాయని శ్రీకుమార్ తెలిపారు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ధర్మధ్వజం వంటి పేజీలు తమ ఫాలోవర్ల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నాయని చెప్పారు. 'స్ట్రింగ్ తెలుగు', 'రైట్ వాయిస్', 'నేషనలిస్ట్ హబ్' వంటి యూట్యూబ్ చానెళ్లు, 'సాయి విశ్వతేజ', 'శివశక్తి' వంటి వెబ్సైట్లు హిందూత్వ ప్రచారాన్ని కొనసాగించటంలో ముందున్నాయని విశ్లేషకులు తెలిపారు. ''ఇలాంటి చానెళ్ల విషపు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంపై చర్యలు తీసుకునే విషయంలో సదరు మాధ్యమాలు మా మాట వినటం లేదనీ, కారణం.. అవి కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండటమే'' అని టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వినర్ మన్నె క్రిశాంక్ తెలిపారు. ఇలాంటి విద్వేషాన్ని రెచ్చగొట్టే పేజీలపై ఫేస్బుక్ కంపెనీని సంప్రదించగా.. ఫేస్బుక్లో వేటిని అనుమతించాలన్నదానిపై కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఉన్నాయనీ, వీటిని ఉల్లంఘించే కంటెంట్‌ను అనుమతించబోమని, వాటిని తొలగిస్తామని ఫేస్బుక్ పేర్కొన్నది.