Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జహింగీర్‌పురి ఘటన
- పేదలు, మైనార్టీల నోట 'లాల్ సలాం..' నినాదం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జహంగీర్‌పురిలో ఆక్రమణల తొలగింపు పేరుతో జరిగిన తతంగం చూసి దేశం యావత్తు షాక్‌కు గురైంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్ని సైతం ఉల్లంఘిస్తూ కేంద్రంలోని పాలకులు చేస్తున్న వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ బుల్డౌజర్లకు అడ్డు గా నిలిచిన తీరు..స్థానికుల్లో ధైర్యాన్ని నింపింది. పేదలు, అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయా న్ని అడ్డుకునేందుకు 74ఏండ్ల వయసులో బృందా కారత్ చూపిన పోరాట పటిమ.. అక్కడివారిలో సూర్తిని రగిలించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రతిని చేతిలో పట్టుకొని ఆమె పోలీసుల్ని నిలదీశారు. కూల్చి వేతల్ని ఆపాలని కోర్టు ఉత్తర్వులున్నా.. ఎందుకు అమలుజేయటం లేదని ఆ రోజు క్షేత్రస్థాయిలో పోలీస్ ఉన్నతాధికారుల్ని నిలదీసిన తీరు దేశం యావత్తు చూసింది. 'లాల్ సలాం..లాల్ సలాం..' అంటూ బాధితులంతా సంఘటితమై బుల్డౌజర్లను అడ్డుకున్నారు. ఈ దేశంలో కార్మికులు, కర్షకులు, మైనార్టీలు, అణగారిన వర్గాల వైపు ఎవరు నిలబడుతున్నారన్నది జహింగీర్‌పురి ఉదంతం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇదంతా కూడా దేశవ్యాప్తంగా వార్తల్లో ముఖ్యాంశంగా మారేసరికి ఢిల్లీ పోలీసులు వెనుకడుగు వేయాల్సి వచ్చింది. దశాబ్దాలుగా జహింగీర్‌పురిలో ముస్లింలు, హిందువులు శాంతియుతంగా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇక్కడ ఒక వర్గాన్ని టార్గెట్ చేయటం ద్వారా కేంద్రంలోని మోడీ సర్కార్ రాజకీయ కుట్రలకు తెరలేపిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి వీడియో దృశ్యాలకు, వార్తలకు ప్రధాన మీడియా ప్రాముఖ్యత ఇవ్వలేదు. కూల్చివేతలను ఆపాలంటూ సీజేఐ ఉత్తర్వులు ఇచ్చారంటూ నామమాత్రంగా వార్తల్ని ప్రసారం చేశాయి. దిన పత్రికల్లోనూ అదే ధోరణి కనపడింది. మోడీ సర్కార్ ఆగ్రహానికి గురవుతామేమో? అన్న భయంతో జహంగీర్‌పురి ఘటనను ప్రధాన మీడియా చూపలేదనే కామెంట్స్ వినపడ్డాయి.
హిందువుల ఓట్లు పోతాయనా?
జహింగీర్‌పురిలో చోటుచేసుకున్న పరిణామాల్ని అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వంగానీ, కాంగ్రెస్‌గానీ పట్టించుకోలేదు. ఓట్లు వేయించుకున్న ఆప్ తమను దారుణంగా మోసం చేసిందని బాధిత కుటుంబాలు, వారి సభ్యులు ఆవేదన చెందుతున్నారు. కూల్చి వేతలకు వ్యతిరేకంగా పోరాటంలోకి దిగితే.. హిందు వుల ఓట్లు పోతాయేమోనని ఆప్, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయని తెలిసింది. దీనిని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందనే ఆప్, కాంగ్రెస్‌లు రాలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. బయట మీడియా ముందు మాత్రం ఆప్, కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద మాటలు చెబుతు న్నారని, తీవ్రమైన పరుష పదజాలంతో మాటలు వదులుతున్నారని, క్షేత్రస్థాయిలో మాత్రం పేదలు, మైనార్టీ ముస్లింల వైపు నిలబడటానికి మాత్రం ముందుకు రావటం లేదని విమర్శలు వెలువడుతున్నాయి.