Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారం నుంచి పత్రికల్లో ప్రకటనల హోరు
- లక్షల రూపాయలు వెచ్చించిన జమ్మూకాశ్మీర్ యంత్రాంగం
- జిల్లా స్థాయిలో సోషల్ మీడియా సెల్ల ఏర్పాటు
జమ్మూకశ్మీర్ : ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా అక్కడి యంత్రాంగం తీరు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రధాని చేత ప్రారంభించబడే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించి మోడీ చిత్రంతో కూడిన ప్రకటనలను అక్కడి యంత్రాంగం పత్రికల్లో హౌరెత్తించింది. గత వారం రోజుల నుంచి దాదాపు 18 వరకు స్థానిక, జాతీయ పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలను ఇచ్చింది. జమ్మూకాశ్మీర్‌లో ప్రధాని ఒక్క రోజు పర్యటన సందర్భంగా ఆయన పాల్గొనబోయే కార్యక్రమాలను హైలెట్ చేసేందుకు జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. జమ్మూకాశ్మీర్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ (డీఐపీఆర్) ఇందుకు కలర్ అడ్వర్టైజ్మెంట్లను ఇచ్చింది. ఈ విషయంలో జమ్మూకాశ్మీర్ యంత్రాంగం అత్యుత్సాహం ప్రదర్శించిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు జాతీయ పత్రికల్లో ఈ ప్రకటనలు లోపలి పేజీల్లో కూడా దర్శనమిచ్చాయి. ఇక శ్రీనగర్, జమ్మూ లకు చెందిన స్థానిక పత్రికల్లో సర్క్యులేషన్‌తో సంబంధం లేకుండా ప్రజా ధనాన్ని ప్రకటనలపై ఖర్చు చేసింది అక్కడి యంత్రాంగం. డీఐపీఆర్ సమాచారం ద్వారా ఇది తెలిసింది. ఈ ప్రచార ప్రకటనల అంచనా లక్షల్లో ఉంటుందని డీఐపీఆర్ లోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒక్కో ప్రకటనకు రూ. 50 వేల వరకు ఉంటుందని వివరించాయి. ఈ ప్రచార పర్వం ప్రధాని ఒక్క రోజు పర్యటన తర్వాత '' కొన్ని రోజుల పాటు'' కొనసాగుతుందని వెల్లడించాయి. కాగా, ఈ విషయంపై స్పందించడానికి డీఐపీఆర్ డైరెక్టర్ రాహుల్ పాండే తిరస్కరించారు. అభివృద్ధి పనుల గురించి పాజిటివ్ సందేశాన్ని పంపేందుకు ట్విట్టర్, ఇతర వేదికల్లో ప్రకటనలను షేర్, రీ-షేర్ చేయడం కోసం జిల్లా స్థాయిలో సోషల్ మీడియా సెల్‌లను ఏర్పాటు చేసినట్టు డీఐపీఆర్ అధికారి ఒకరు తెలపటం గమనార్హం.
సర్వత్రా విమర్శలు
మోడీ పర్యటన సందర్భంగా పత్రికల్లో ప్రకటనలకు ప్రజా ధనాన్ని వృథా చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జమ్మూకాశ్మీర్ యంత్రాంగం తీరును సామాజిక కార్యకర్తలు, పౌరసంఘాల నాయకులు, పలువురు రాజకీయనాయకులు తప్పుబట్టారు. మోడీకి అభివృద్ధిపై శ్రద్ధ లేదనీ, అభివృద్ధి పేరుతో ప్రచారం చేసుకోడమే ఆయనకు కావాల్సిందని ఆరోపించారు.
జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు డొల్లేనా..?
జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రధాని మోడీ ఇక్కడ పర్యటిస్తున్నారు. ఆర్టికల్ రద్దు అనంతరం జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విడగొట్టిన విషయం విదితమే. ఆదివారం మోడీ పల్లిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలోని సుంజ్వాన్‌లో శుక్రవారం ఉగ్రదాడి చోటు చేసుకున్నది. ఈ ఘటనలో సీఐఎస్ఎఫ్కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయారు. పది మందికి పైగా జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడిందని కేంద్రం పలు సందర్భాల్లో చెప్తున్నది. అయితే, ఆ ఆర్టికల్ రద్దు తర్వాత తొలి సారి జమ్మూకాశ్మీర్ పర్యటనకు మోడీ వస్తున్న వేళనే ఉగ్రదాడి చోటు చేసుకున్నది. దీంతో కేంద్రం చెప్తున్న మాటలు, ప్రస్తుత ఉగ్రవాద దాడిని ఉటంకిస్తూ అక్కడి భద్రతపై విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.