Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కర్నాటకలో ఇద్దరు దళితులు హత్య
న్యూఢిల్లీ : కర్నాటకలో దళితులపై ఆకృత్యాలు, దాడులకు అడ్టుకట్ట పడటం లేదు. రెండు రోజుల క్రితం తుమాకూరు జిల్లా పెద్దనహళ్లి గ్రామంలో ఇద్దరు దళితుల్ని గొడ్డును బాదినట్టు బాదారు. అత్యంత పాశవికంగా హింసించి చంపారు. గురువారం రాత్రి గుర్తుతెలియని కొంతమంది గిరిష్ ముదాలగిరిప్పా (30), గిరీష్ (32)..అనే ఇద్దరు వ్యక్తుల్ని హత్యచేసి కాల్వలో పడేశారు. ఈ హత్యలకు సంబంధించిన వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై సమాచారమందుకున్న స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు. హత్యల వెనుక ఆరుగురు వ్యక్తులు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కేసులో నందీశ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడని, హత్యల వెనుక ప్రధాన సూత్రధారిగా కనపడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు చెబుతున్నదాని ప్రకారం, గురువారం రాత్రి ముదాలగిరిప్పా, గిరీష్ల ఇంటికి నందీశ్ వెళ్లాడు. రాత్రి సమయంలో ఎవరూలేని చోటకు వారిద్దర్నీ తీసుకెళ్లాడు. అక్కడ వేచి చూస్తున్న తన స్నేహితులతో కలిసి గిరిష్ ముదాలగిరిప్పా, గిరీష్‌లపై తీవ్రమైన దాడికి తెగబడ్డాడు. ముదాలగిరిప్పా ఘటనా స్థలంలోనే చనిపోయాడు. గిరిష్ తప్పించుకునే ప్రయత్నం చేయగా..వెంటాడి తీవ్రంగా కొట్టారు.
అయితే వీరిద్దర్నీ హత్య చేసేంత కారణాలు ఏమై ఉంటాయన్నది తెలియరాలేదు. హత్యల వెనుకున్న అందర్నీ పట్టుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్‌కుమార్ మీడియాకు చెప్పారు. హత్యలపై తుముకూరు జిల్లాలో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.