Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టులో ఆశిష్‌మిశ్రా సరెండర్
లఖీంపూర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖీంపూర్ ఖేరీలో రైతులపై హత్యాకాండ కేసులో కేంద్రమంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా ఆదివారం కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసులో ఆశీష్ మిశ్రా బెయిల్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 18న రద్దు చేసింది. వారం రోజుల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ నేపధ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక రోజు ముందుగానే ఆశీష్ మిశ్రా లొంగిపోయాడు. 'లఖీంపూర్ కోర్టులో ఆశీష్ మిశ్రా లొంగిపోయాడు. మాకు వారం రోజుల వ్యవధి ఉంది. సోమవారం చివరిరోజు. కానీ ఒక రోజు ముందే లొంగిపోయాడు' అని అతని తరుపు లాయర్ అవదేశ్ సింగ్ మీడియాకు చెప్పారు. భద్రతా కారణాలతో ఆశీష్‌ను జైలులోని ప్రత్యేక బారక్‌లో అధికారులు ఉంచారు. గత ఏడాది ఆక్టోబర్ 3న లఖీంపూర్ ఖేరీలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా అక్కడ నిరసన చేస్తున్న రైతులపైకి ఎస్యువి ఎక్కించి ఆశీష్ మిశ్రా హత్య చేశాడు. ఆ రోజు హింసాకాండలో మొత్తంగా ఎనిమిది మంది మరణించారు. ఈ కేసులో ఆశీష్ మిశ్రాను అరెస్టు చేసినా అతనికి అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిని వ్యతిరేకిస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.