Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంధనం, ఆహారం..అన్నింటి ధరలూ పైపైకీ..
- మార్చిలో 14.5శాతం
- పెరిగిన హోల్‌సేల్ మార్కెట్ ధరలు
- సరుకుల ధరలకు... వచ్చే జీతాలకు పొంతన కరువు!
- ఆందోళనలు, నిరసనలు మొదలైతాయని..తెరపైకి మతతత్వం
- హిందీ కొత్త సంవత్సరాది, రామ నవమి, హనుమాన్ జయంతి..సందర్భంగా రెచ్చగొట్టే చర్యలు
దేశం సంగతేమోగానీ..దేశ ప్రజలు నేడు దివాళా అంచున నిలబడ్డారు. పెరిగిన ధరలకు, వస్తున్న ఆదాయానికి పొంతనలేక సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. కుటుంబాలు ఆదాయం కోల్పోవటంపై, నిరుద్యోగ సమస్యపై మోడీ సర్కార్ ఒక్కమాటా మాట్లాడటం లేదు. పెట్రోల్, డీజిల్‌పై భారీ మొత్తంలో పన్నులు విధిస్తూ తన ఖజానాని కేంద్రం నింపుకుంటోంది. ఆహారం, నిత్యావసర సరుకుల ధరలు పెరిగితే మాకేంటి? ఉద్యోగాలు, ఉపాధి పోతే మాకేంటి? అన్నంటూ కేంద్రం వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించామా? లేదా?..అదొక్కటే ప్రామాణికం అన్నట్టు ఉంది. ప్రజల ఆగ్రహం,
నిరసనను దారిమళ్లించేందుకు మతతత్వాన్ని రెచ్చగొడుతూ కాలం గడుపుతోంది.
న్యూఢిల్లీ : లీటర్ వంట నూనె ప్యాకెట్ రూ.200కు చేరుకుంది. ముందు ముందు ధరలు ఇంకా పెరుగుతాయని సమాచారం. ఇంధన ధరలు విపరీతంగా పెంచేసి కేంద్రం లక్షల కోట్ల రూపాయల ఆదాయం పోగేసుకుంటోంది. కోవిడ్ సంక్షోభం వచ్చి రెండేండ్లు దాటుతోంది..అయినా పేదలు, మధ్య తరగతి జీవన పరిస్థితుల్లో మార్పు రాలేదు. ఆదాయాలు కోల్పోయిన కుటుంబాలు, చాలీచాలని జీతాలతో పెరిగిన ధరల్ని భరించలేకపోతున్నాయి. మోడీ సర్కార్ విధానాలతో విసిగివేసారి..రైతులు ఏడాదిపాటు కఠోరమైన నిరసన చేపట్టారు. ఇటీవల బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు దిగారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలో మోడీ సర్కార్‌కు చీమకుట్టినంత బాధ కూడా కలగటం లేదు.
మరొక ముఖ్యమైన సమస్య ఏంటంటే, కరోనా సంక్షోభం తర్వాత కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. మార్కెట్ కార్యకలాపాలు మొదలైనా జాబ్ మార్కెట్ మాత్రం పుంజుకోలేదు. మునపటి స్థాయిలో వేతనాలు అందటం లేదు. నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉండటం వల్ల ..తక్కువ వేతనంతో కూడిన ఉద్యోగాల్ని చేయాల్సి వస్తోంది. 'ఎకనామిక్ టైమ్స్' సర్వే ప్రకారం, గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర వేతనాలూ తగ్గాయి. దీనికి తోడు ద్రవ్యోల్బణం రికార్డ్‌స్థాయిలో ఉంది.
ఈ ధరలు భరించలేం..
దేశంలో అన్నింటి ధరలూ విపరీతంగా పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఫిబ్రవరిలో ఆహార పదార్థాల ధరల్లో పెరుగుదల 5.85శాతం కాగా, మార్చిలో 7.68శాతానికి పెరిగింది. ఇతర నిత్యావసర ధరలు 7శాతం పెరిగాయి. ఇక వంటనూనె ధరలు సలసలా కాగిపోతున్నాయి. వీటి ధరలు 18.79శాతం, కూరగాయల ధరలు 11.64శాతం, మాంసం, చేపలు 9.63శాతం, వంట దినుసులు 8.5శాతం, పప్పులు, పాలు, పాల ఉత్పత్తులు 10శాతం వరకు పెరిగాయి. మనదేశంలో పేదలు, మధ్య తరగతి కుటుంబ ఆదాయంలో ఆహారంపై అత్యధికంగా ఖర్చు అవుతోంది. ఇంధన ధరల పెంపువల్ల ఇతర నిత్యావసర సరుకులు 7.5శాతం, వస్త్రాలు, చెప్పుల ధరలు 9.4శాతం పెరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అయితే హోల్‌సేల్ మార్కెట్లో ధరల పెరుగుదల 14.5శాతం కనపడుతోంది. గత పదేండ్లలో ఎన్నడూ లేనంతగా ధరల పెరుగుదల నమోదైందని తెలుస్తోంది.
ఆయా రాష్ట్రాల్లో మత హింస
కొద్ది రోజుల క్రితం 9రాష్ట్రాల్లో మత హింస చోటుచేసుకుంది. హిందీ సంవత్సరాది పురస్కరించుకొని ఏప్రిల్-2న, ఏప్రిల్-10న రామనవమి, ఏప్రిల్-16న హనుమాన్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘటనలు దేశాన్ని నివ్వెరపర్చాయి. మైనార్టీ ముస్లింలను లక్ష్యంగా చేసుకొని హిందూత్వ శక్తులు జరిపిన ర్యాలీలు మత హింసకు దారితీశాయి. మసీదుల వద్ద రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. మసీద్‌లపై కాషాయ జెండా ఎగురవేసి రెచ్చగొట్టారు. మసీదులు, దేవాలయాల వద్ద చిన్న చిన్న దుకాణాలను ధ్వంసం చేశారు. అక్కడ జీవనోపాధిని కోల్పోయి హిందువులు, ముస్లింలు తీవ్రంగా నష్టపోయారు. మత హింసతో దేశంలో మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అధిక ధరలు, నిరుద్యోగం, ఉపాధి, వేతనాలు..వంటి అంశాలపై నుంచి ప్రజల దృష్టి మరలిపోయింది.