Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐడేండ్లలో రెండు కోట్ల మంది మహిళలు దూరం పడిపోయిన కార్మికరేటు
- 46 శాతం నుంచి 40 శాతానికి తగ్గుదల : సీఎంఐఈ
- ఉద్యోగాల కల్పనలో మోడీ సర్కారు విఫలం : విశ్లేషకులు
కేంద్రంలోని మోడీ పాలనలో భారత్లో మహిళలకు ఉద్యోగ, ఉపాధి కల్పన ఆందోళనకరంగా ఉన్నది. దేశ శ్రామికశక్తిలో వారి సంఖ్య క్రమంగా పడిపోతున్నది. గత ఐదేండ్లలో దాదాపు రెండు కోట్ల మంది మహిళలు శ్రామిక శక్తికి దూరమయ్యారు. ఇక, దేశంలోని 90 కోట్ల మంది శ్రామిక వర్గంలో 50 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగ, ఉపాధిని కోరుకోవటం లేదు. ముఖ్యంగా, ఇది మహిళల్లో అధికంగా ఉన్నది. సరైన ఉద్యోగం దొరకటంలేదన్న ఆందోళన వారిలో పెరగటమే ఇందుకు కారణం! ఈ షాకింగ్ వార్తను ముంబయిలోని పరిశోధన సంస్థ అయిన 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎంఐఈ)' వెల్లడించింది.
న్యూఢిల్లీ : సీఎంఐఈ సమాచారం ప్రకారం.. దేశ శ్రామిక శక్తికి మహిళలు దూరమయ్యారు. 2017-22 మధ్య ఐదేండ్లలో దాదాపు రెండు కోట్ల మంది మహిళలు వీడారు. ఇదే కాలంలో మొత్తం లేబర్ రేటు 46శాతం నుంచి 40శాతానికి పడిపోయింది. ఇక హర్యానాలో మార్చిలో నిరుద్యోగరేటు 26.7శాతంతో అత్యధికంగా ఉన్నది. ఆ తర్వాత రాజస్థాన్ (25శాతం), జమ్మూ కాశ్మీర్ (25శాతం), బీహార్ (14.4 శాతం), త్రిపుర (14.1 శాతం), పశ్చిమ బెంగాల్ (5.6 శాతం) లు ఉన్నాయి. దేశంలో ఉపాధి కల్పన సమస్య, ప్రత్యేకించి శ్రామిక శక్తిని వీడుతున్న మహిళల సంఖ్య పెరిగిపోవటం, అధిక ముప్పునకు ఎలా మారుతుందన్నది సీఎంఐఈ తాజా సమాచారం చూపింది.
జనాభాలో 49 శాతం.. ఆర్థిక ఉత్పత్తిలో 18శాతమే..!
దేశ జనాభాలో 49 శాతంగా ఉన్న మహిళలు.. ఆర్థిక ఉత్పత్తిలో 18శాతంగా ఉన్నారు. ఇది ప్రపంచ సగటులో దాదాపు సగం కావటం గమనార్హం. మహిళలు శ్రామిక శక్తిలో చేరాలనుకోవటం లేదని సీఎంఐఈకి చెందిన మహేశ్ వ్యాస్ బ్లూంబర్గ్కు తెలిపారు. 2019 కంటే 2021లో మహిళల జాతీయ సగటు నెలవారి ఉపాధి 6.4 శాతం తక్కువగా ఉన్నదని తేలింది. 2019తో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో మహిళల సగటు నెలవారీ ఉపాధి వేగంగా పడిపోయిందనీ, 22.1 శాతం మందికే ఉపాధి లభించింది. 2019, 2020తో పోలిస్తే.. 2021లో కొందరు మహిళలు ఉద్యోగ, ఉపాధి కోసం చూశారనీ, ఆ తర్వాత అది వేగంగా పడిపోయింది. నాలుగు రాష్ట్రాల్లో సగటు నెలవారి మహిళ ఉపాధి 50 శాతం కంటే ఎక్కువగా తగ్గింది. వీటిలో తమిళనాడు, గోవా, జమ్మూకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. భారత సగటు నెలవారీ మహిళా ఉపాధి 2021లో కేవలం 4.9 శాతంగా ఉన్నది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య భారీ తేడా..!
ఇక ఈ తేడా పట్టణ, గ్రామీణ ప్రాంతాలో మధ్య భారీగా ఉన్నది. 2021లో పట్టణ ప్రాంతాల్లో ఇది 6.9 శాతంగా ఉన్నది. 2020తో పోలిస్తే తక్కువగా ఉన్నది. ఇక కరోనా మహమ్మారికి ముందు 2019 ఏడాదితో పోలిస్తే ఇది 22.1శాతం తక్కువ కావటం గమనార్హం. ఇక గ్రామీణ భారత్లో ఇది 2021లో 9.2 శాతం ఉన్నది. 2019లో ప్రతి నెలా దాదాపు 95 లక్షల మంది మహిళలు ఉద్యోగాల కోసం క్రియాశీలంగా ఎదురు చూశారు. ఇది 2021లో 65.2 లక్షలకు పడిపోవటం గమనార్హం.
కేంద్రం విఫలం
2017-18కి సంబంధించి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పడిపోయింది. 2011-12లో 31 శాతం మంది మహిళలు ఉపాధి కలిగి ఉండగా అది 22 శాతానికి పడిపోవటం గమనార్హం. భారత్ 2030 నాటికి కనీసం 9 కోట్ల వ్యవసాయేతర ఉద్యోగాలు సృష్టించాల్సినవసరం ఉన్నదని వార్షిక జీడీపీ వృద్ధి 8 నుంచి 8.5శాతం అవసరమని మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్-2020 నివేదిక పేర్కొన్నది. సీఎంఐఈ అంచనాల ప్రకారం.. 2019 జనవరిలో భారత్లోని పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కలిగి ఉన్నవారి సంఖ్య 12.84 కోట్లుగా ఉన్నది. 2021 డిసెంబర్ నాటికి అది 12.47 కోట్లకు పడిపోవటం గమనార్హం. ఇక దేశంలో ఉపాధి కోసం ఎదురు చూస్తున్నవారి సంఖ్య వేగంగా పెరిగిపోతున్నదనీ, వారికి సరైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం విఫలమైందని విశ్లేషకులు తెలిపారు.