Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరంగా యాత్రలో పాల్గొన్న హిందూ, ముస్లింలు
న్యూఢిల్లీ : శోభాయాత్ర ఢిల్లీలో మత ఉద్రిక్తతకు దారితీయగా..తిరంగా యాత్రా (భారత పతాకం) జహింగీర్‌పురిలో మత సామరస్యాన్ని నింపింది. జహంగీర్‌పురిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను నిరసిస్తూ హిందూ, ముస్లింలు ఆదివారం 'తిరంగా యాత్ర'ను చేపట్టారు. మత హింసను, అల్లర్లను ఖండిస్తూ, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని సాగిన కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా నివసిస్తున్న హిందూ, ముస్లింలంతా బయటకు వచ్చి భారత పతకాన్ని చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ఢిల్లీ మున్సిపల్ అధికారులు అక్కడ చేపట్టిన కూల్చివేతల కారణంగా ఎంతోమంది హిందూ, ముస్లింలు ఉపాధి కోల్పోయారు. కూల్చివేతల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బుల్డౌజర్లతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేపట్టిన చర్యలు వివాదాస్పదమయ్యాయి. మత ఘర్షణలు, కూల్చివేతల ఘటన తర్వాత జహింగీర్‌పురిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిని తొలగించడానికి స్థానికులు తిరంగా యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శాంతి సామరస్యాలు నెలకొనాలని, అందుకోసం అందరూ తమవంతు ప్రయత్నం చేయాలని ర్యాలీలో పాల్గొన్నవారు కోరారు. ఇటీవల చోటుచేసుకున్న అల్లర్లు హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదరభావాన్ని దెబ్బతీశాయని ఆందోళన వ్యక్తం చేశారు. తిరంగా యాత్ర నేపథ్యంలో ప్రభుత్వం బందోబస్తు కోసం పోలీసుల్ని పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపింది. శాంతిసామరస్యాలు నెలకొల్పటం కోసం తిరంగా యాత్ర చేపడతామని కొంతమంది ముందుకు వచ్చారని, అందుకు తాము అంగీకరించామని, ఈ యాత్రలో హిందూ, ముస్లింలు పాల్గొన్నారని ఈశాన్య ఢిల్లీ డీసీపీ ఉషా రంగాణీ చెప్పారు. తిరంగా యాత్రలో పాల్గొన్న స్థానికుడు తివారీ మాట్లాడుతూ..''దయచేసి ఇక్కడ జరిగేవాటిపై పుకార్లను ఎవ్వరూ నమ్మవద్దు. మొదటిసారిగా ఇక్కడ మత అల్లర్లు జరిగాయి. అంతకు ముందు ఎన్నడూ ఇలాంటివి చూడలేదు. అల్లర్లు జరగకుండా చూసుకోవాలని మేమే నిర్ణయించుకున్నా''మని చెప్పారు. సి, బి, డి బ్లాకుల్లో నివసిస్తున్నవారిపై నిన్నటి అల్లర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. తిరంగా యాత్ర నేపథ్యంలో వారు శాంతిసామరస్యాలు నెలకొనాలని కోరుతూ సందేశాలు పంపారు.