Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ కుబేరుల్లో ఐదో స్థానం
న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో సామాన్యుడి సంపద రోజురోజుకు పడిపోతుంటే.. గౌతమ్ అదానీ సంపద మాత్రం రాకెట్ వేగంతో పెరుగుతున్నది. తాజాగా అమెరికా కార్పొరేట్ దిగ్గజం వారెన్ బఫెట్ సంపదను ఆయన మించిపోయారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదానీ సంపద మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరజిల్లుతోంది. ముఖ్యంగా కరోనా సంక్షోభ కాలంలో కోట్లాది మందికి కనీసం తినడానికి తిండి కూడా దొరకని సమయంలోనూ.. అదానీ సంపద రోజుకు వందలు, వేల కోట్ల చొప్పున పెరిగింది. ఈ పరంపరలో ఆయన అనేకమంది బహుళ జాతి కార్పొరేట్ అధినేతలను దాటేసి.. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒక్కొక్కరిని వెనక్కి నెట్టేస్తూ ప్రపంచంలోనే ఐదో స్థానానికి ఎగబాకారు. ఫోర్బ్ మాగ్జిన్ రిపోర్ట్ ప్రకారం.. ఏప్రిల్ 22 నాటికి స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి అదానీ గ్రూపు కంపెనీల షేర్ల విలువ ప్రకారం.. అదానీ సంపద విలువ 123.7 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.9.27 లక్షల కోట్లు)కు చేరింది. దీంతో 121.7 బిలియన్ డాలర్ల(రూ.9.07 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో ఐదవ స్థానంలో ఉన్న వారెన్ బఫెట్‌ను వెనక్కి నెట్టారు.
అమెరికా మార్కెట్లో బఫెట్‌కు చెందిన బెర్క్ షైర్ హాత్వే షేర్లు శుక్రవారం సెషన్లో రెండు శాతం పడిపోవడంతో.. ప్రపంచ ధనవంతుల జాబితాలో 6వ స్థానానికి దిగజారినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. రెండేళ్ల క్రితం అదానీ ఆస్థుల విలువ కేవలం 8.9 బిలియన్ డాలర్లు (రూ.66.7 వేల కోట్లు)గా ఉంది. ప్రభుత్వ అండతో పెట్టుబడులు, ఇతర కంపెనీల స్వాధీనం కొనసాగడంతో అదానీ షేర్లపై ఇన్వెస్టర్లు భారీ ఆసక్తిని కనబర్చుతున్నారు. కేవలం 2021 మార్చి నుంచి 2022 మార్చి మధ్య ఏకంగా 90 బిలియన్ డాలర్లు (6.75 లక్షల కోట్లు) ఎగిసింది. ప్రస్తుతం అదానీ సంపద రూ.9.27 లక్షల కోట్లకు చేరడంతో దేశ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ముకేష్ అంబానీ 104.7బిలియన్ డాలర్ల (రూ.7.85 లక్షల కోట్లు)తో రెండో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల్లో స్పేస్ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ 259 బిలియన్ డాలర్ల(రూ.19.42 లక్షల కోట్లు) సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 169 బిలియన్ డాలర్లు(రూ.12.76 లక్షల కోట్లు), తదితరులు ఉన్నారు.