Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంటల్లో చిక్కుకుని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు
- ఘటనా స్థలంలో కరపత్రాలు వదిలివెళ్లిన మావోయిస్టులు
నవతెలంగాణ- దుమ్ముగూడెం
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో సరివెల, కొత్తూరు గ్రామాల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రయాణ ికులతో వెళుతున్న ఒడిశాకు చెందిన ప్రయివేటు బస్సును మావోయిస్టులు పెట్రోలు పోసి నిప్పంటించారు. జైపూర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న బస్సును మావోయిస్టులు ఆపి ప్రయాణికులను దిగి వెళ్లిపొమ్మని హెచ్చరించారు. రాత్రి సమయంతో పాటు అటవీప్రాంతం కావడంతో ప్రయాణికులు తాము దిగమని భీష్మించారు. దాంతో మావోయిస్టులు వారి వెంట తెచ్చుకున్న పెట్రోలు పోసి బస్సుకు నిప్పంటించారు. దాంతో ప్రయాణికులు భయంతో వారి వెంట తెచ్చుకున్న సామగ్రిని బస్సులోనే ఉంచి అరుపులు కేకలతో బయటకు పరుగులు తీశారు. బస్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు తలబాగంలో మంటలు అంటుకోగా ప్రయాణికుల సామగ్రి మాత్రం పూర్తిగా కాలిపోయింది. బస్సులో దాదాపు 50మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు పాల్గొన్నారని, చెట్ల మాటున ఇంకా 10 మంది ఉన్నారని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్ఐ గజేంద్ర, యాదగిరి చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. దక్షిణ బస్తర్లో ఇటీవల డ్రోన్ బాంబులతో ఆదివాసీ గ్రామాల్లో పోలీసులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ బస్సును తగలబెట్టినట్టు అక్కడ వదిలివెళ్లిన కరపత్రంలో పేర్కొన్నారు. ఆదివాసీ గ్రామాలపై డ్రోన్ల సహాయంతో చేస్తున్న దాడులను వెంటనే ఆపాలని, లేకపోతే ప్రతి దాడులు నిర్వహిస్తామని కరపత్రం ద్వారా హెచ్చరిక చేశారు.