Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీచర్ల నిరసనకు అడుగడుగునా అడ్డంకులు
- రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది అరెస్ట్
- సిపిఎస్‌పై మాట నిలబెట్టుకోవాలన్నందుకు తీవ్ర నిర్బంధం
విజయవాడ : సిపిఎస్ రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరిన ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సిపిఎస్‌తో భద్రత కరువైన జీవితాల గోడును ప్రభుత్వానికి వినిపించడానికి కదిలిన ఉపాధ్యాయులపై సోమవారం తీవ్ర స్థాయిలో నిర్బంధాన్ని ప్రయోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమందిని అరెస్ట్ చేసింది. ఆది, సోమవారాల్లో ఆరువేల మందికి పైగా ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సిఎం కార్యాలయం ఉన్న తాడేపల్లికి కాదు కదా... గుంటూరు, కృష్ణా జిల్లాల్లోకి ఇతర జిల్లాల ఉపాధ్యాయులెవ్వరూ రాకుండా కఠిన ఆంక్షలను అమలు చేసింది. ఆ రెండు జిల్లాలోని ఉపాధ్యాయులను సైతం కదలనీయకుండా అడుగడుగునా అడ్డంకులు కల్పించింది. మరో మాటలో చెప్పాలంటే కృష్ణా, గుంటూరు జిల్లాలను పోలీసులు పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు. గుంటూరు, విజయవాడ నగర శివార్లలో అడుగడుగున బారికేడ్లు, ముళ్లకంచెలను ఏర్పాటు చేశారు. తాడేపల్లిలోని సిఎం కార్యాలయం నుండి కిలోమీటర్ల దూరం కర్ప్చూ వాతావరణం కనిపించింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం, యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయాల వద్ద కూడా ఇదే పరిస్థితి. . తాడేపల్లిలో దుకాణాలను సైతం పోలీసులు బలవంతంగా మూయించారు.అనేక ప్రాంతాల్లో వాటర్కెనాన్లను పోలీసులు ఏర్పాటుచేశారు. జాతీయ రహదారిపై నుంచి కిందకు దిగకుండా ఉండేందుకు సుమారు రెండు కిలో మీటర్ల వరకు ముళ్లకంచెను వేశారు. ఇతర జిల్లాల నుండి వచ్చే వారిని అడ్డుకోవడం కోసం బస్సులు, రైళ్ళతో పాటు ప్రైవేటు వాహనాలను పెద్ద
ఎత్తున తనిఖీలు చేసింది. కేవలం మఫ్టీలోనే కాకుండా మారువేషాల్లో కూడా ఉపాధ్యాయుల కోసం పోలీసులు గాలించడం కనిపించింది. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేశారు. ఈ అడ్డంకులన్నీ దాటుకుని తాడేపల్లి, విజయవాడ పరిసరప్రాంతాలకు చేరుకున్న ఉపాధ్యాయులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. రాత్రి ఎనిమిది గంటల వరకు వీరిని స్టేషన్లలోనే నిర్బంధించారు. డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా విజయవాడ, తాడేపల్లి ప్రాంతాల్లో తన కాన్వాయితో మధ్యాహ్నం వరకు గస్తీ కాశారు. విజయవాడలోని యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా పోలీసులు మోహరించారు. యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కెఎస్ఎస్ ప్రసాద్‌లను ఆదివారం రాత్రి అరెస్టు చేసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే వారిని ఎక్కడకు తరలించారన్న సమాచారాన్ని సోమవారం మధ్యాహ్నం వరకు పోలీసులు చెప్పలేదు. వారి దగ్గర ఉన్న ఫోన్లతో పాటు వారితో పాటు స్టేషన్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఫోన్లు కూడా పైఅధికారులు తీసుకున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకున్న యుటిఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి పి.బాబురెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సిహెచ్ రవీంద, ఎస్పి మనోహర్, కోశాధికారి బి గోపిమూర్తి, నాయకులు సుందరయ్య, కె.భగీరధ, టిఎస్ఎన్ మల్లేశ్వరరావు, రాజశేఖర్, సుందరయ్యల తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ స్టేషన్లలో ఉన్న ఉపాధ్యాయులను సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, వి వెంకటేశ్వర్లు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జి రామన్న పరామర్శించారు. ఇచ్చిన హామీని అమలు చేయకుండా అరెస్టులు చేయడం సరికాదని ఖండించారు.
ఎక్కడికక్కడ అరెస్టులు... నిరసనలు
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో వివిధ పాఠశాలల వద్ద పోలీసు గస్తీని ఏర్పాటు చేశారు. ఆందోళనలో పాల్గొంటారని అనుమానం వచ్చిన ప్రతిఒక్కరిని అదుపులోకి తీసుకున్నారు. దుగ్గిరాల వద్ద ఏకోపాధ్యాయ పాఠశాలలో పనిచేసే ఒక ఉపాధ్యాయుడ్ని అదుపులోకి తీసుకోవడంతో ఆ పాఠశాల తలుపులు తీసే వారు లేక విద్యార్థులు ఆరుబయట కూర్చున్నారు. ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావును గుంటూరులో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు గృహ నిర్బంధంలో ఉంచారు. కాజ టోల్గేట్ వద్ద 45 మందిని, మంగళగిరిలో 27 మందిని, గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న 20 మంది ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. కృష్ణాజిల్లాలోని ఐదు డిపోల నుండి విజయవాడ రూట్లో వెళ్లే ఆర్టిసి సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. పాఠశాలల్లో విధులు నిర్వహించేందుకు మచిలీపట్నం నుంచి వెళుతున్న పలువురు ఉపాధ్యాయులను పెడన స్టేషన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారా? రాకపోతే కారణం ఏంటి అంటూ పై అధికారులు అనేక ప్రాంతాల్లో ఆరా తీశారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి విజయవాడ వెళ్లే ఆర్టిసి బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిలిపివేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీని పోలీసులు మధ్యాహ్నం వదలిపెట్టారు. అనంతరం ఆయన విజయవాడ బయల్దేేరగా కలపర్రు టోల్గేట్ వద్ద అడ్డుకున్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో యుటిఎఫ్ నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద యుటిఎఫ్, ఎన్‌జిఒ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ వెళ్లకుండా ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 500 మందికిపైగా ఉపాధ్యాయులను వివిధ స్టేషన్లలో నిర్బంధించారు. మరో 500 మందికి నోటీసులిచ్చారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అక్రమ అరెస్టులకు నిరసనగా పార్వతీపురం మన్యం జిల్లాలో సిఐటియు ఆధ్వర్యాన రాస్తారోకో చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్.పురం మండలం రేఖపల్లి సెంటర్లో యుటిఎఫ్ నాయకులు నిరసన తెలిపారు.
పోరాటం ఆగదు : లక్ష్మణరావు
సిపిఎస్ రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మట్లాడుతూ సిఎం వెంటనే జోక్యం చేసుకుని సిపిఎస్ రద్దుకు రోడ్‌మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులపై నిర్బంధం అమలు చేసి, నిరంకుశంగా వ్యవహరించడం తగదన్నారు. రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై ఇంతటి నిర్బంధం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. అరెస్టు చేసిన ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.