Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతిపెద్ద ప్రజాస్వామ్యం..ఉత్తమాట
- ఇంత జరుగుతున్నా.. అల్లరి మూకలకే ప్రధాన మీడియా మద్దతు
- జహంగీర్‌పురిలో ఒక వర్గంవారిని టార్గెట్ చేస్తూ వార్తా కథనాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్... అని బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో అనేకమార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విద్వేష భావజాలం తెలిసుంటే ఆయన ఈ మాట చెప్పేవారు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మనదేశంలో ప్రజాస్వామ్యం ఎప్పుడో దెబ్బతిన్నదని.. మోడీ హయాంలో మూకస్వామ్యం నడుస్తోందని వారు విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ 'మూకస్వామ్యం' ప్రభావితం చేసే స్థాయికి నేడు దేశంలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జహంగీర్‌పురిలో కూల్చివేత ఘటనల్ని ప్రధాన మీడియాలో ఒక వర్గం చూపినతీరే ఇందుకు నిదర్శనం.
న్యూఢిల్లీ : ఆజ్‌తక్, ఇండియా టుడే.. వంటి వార్తా ఛానెళ్లకు రిపోర్టింగ్‌కు, ఒపీపియన్కు తేడా తెలియటం లేదు. జహంగీర్‌పురిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై ఆ వార్తా ఛానెళ్ల ప్రసారాలు ఏకపక్షంగా ఉన్నాయి. ముస్లిం మైనార్టీ వర్గాలను హిందూత్వ శక్తులు టార్గెట్ చేశాయన్న పాయింట్‌ను విస్మరించాయి. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాగ్ గోస్వామి సంగతి చెప్పక్కర్లేదు. బుల్డోజర్లతో కూల్చివేతలకు దేశం యావత్తు మద్దతు పలకాలని టీవీ కార్యక్రమంలో పోల్ సర్వే నిర్వహించాడు. కూల్చివేతలు సరైనవే.. వాటిని అడ్డుకునేవారు 'జిహాదీ మద్దతుదారులే' అంటూ 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరగుతున్న మత ఘర్షణలు, హింస, బుల్డోజర్ రాజకీయాల్ని... మంచి పాలనకు గుర్తుగా ప్రధాన మీడియాలో ఒక వర్గం తెగ ప్రచారం చేస్తున్నది.
సైన్స్ ఫిలాసఫర్ మీరానందా 2009లో 'ద గాడ్ మార్కెట్' అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన ఏమన్నారంటే, ఈ దేశంలో రాజ్యం-మందిరం-కార్పొరేట్ అనే సంక్లిష్ట వ్యవస్థ కారణంగా హిందూత్వం కొత్త పుంతలు తొక్కుతోంది...అని చెప్పారు. హిందూత్వ శక్తులతో మూకస్వామ్యాన్ని ఈ దేశంలో తీసుకొచ్చేందుకు రకరకాలుగా ప్రయత్నాలు జరుతున్నాయని ఆయన విశ్లేషించారు. ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో మతపరమైన ఎజెండాను తీసుకొచ్చేందుకు ఈ మూకస్వామ్యాన్ని మోడీ సర్కార్ ఉపయోగించుకుంటోంది.
ఎక్కడ మొదలైంది..
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జహంగీర్పుర్లోని సెక్టార్-సీలో ఏప్రిల్ 16న శోభాయాత్ర పేరుతో హిందూత్వ శక్తులు సృష్టించిన అల్లరి అంతా ఇంతా కాదు. శోభాయాత్రపై రాళ్లదాడి చేశారన్న ఆరోపణలతో మోడీ సర్కార్ ఢిల్లీ పోలీసుల్ని రంగంలోకి దింపింది. అక్కడున్న ముస్లిం మైనార్టీలపైకి ఉసిగొల్పింది. వారి దుకాణాలు, ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో నిజానికి ఏం జరిగిందన్నది చాలా మందికి తెలియదు.
రెండేండ్ల క్రితం ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని హిందూత్వ శక్తులు కావాలనే ఎంచుకున్నారు. ఒకే రోజు (ఏప్రిల్ 16న) మూడు శోభాయాత్రలకు ప్లాన్ చేశారు. శోభాయాత్రలో పాల్గొనవారిపై రాళ్ల దాడి స్థానికులైన ముస్లింలే చేశారన్న వాదనలో నిజం లేదు. మసీదులపై కాషాయ జెండా ఎగరవేయటం, అక్కడ రెచ్చగొట్టే మాటలు చెప్పటం, కత్తులు ప్రదర్శించటం.. వంటివి మొదట జరిగాయి. ఒక భయానక వాతావరణం ఏర్పడ్డాక..ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగిందని విశ్వసనీయ సమాచారం.
ఇక్కడ అల్లర్లు ఎలా మొదలయ్యాయి? అన్నది వదిలేసి ప్రధాన మీడియాలో కొన్ని టీవీ ఛానళ్లు ప్రసారం చేసిన వార్తా కథనాలు అభ్యంతరకరంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముస్లిం దుకాణాల కూల్చివేత సరైందే.. అనేట్టు చర్చాగోష్టిలు జరిగాయి. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి అయితే..చట్టాల్ని అమలుజేయడానికి బుల్డోజర్ సరైన ఉపకరణం, చర్య అంటూ సమర్థించారు. అంతేగాక 'ఫర్ బుల్డోజర్స్' 'అగెయినెస్ట్ బుల్డోజర్స్'..ఏది ఎంచుకుంటారు? అంటూ పోల్ సర్వేను కూడా చేపట్టాడు.
వీక్షకులు..టీఆర్పీ రేటింగ్ కోసమా?
శోభాయాత్ర.. శాంతియుతంగా జరిగిందనీ, ముస్లింలే వారిపై మారణాయుధాలతో, రాళ్లతో దాడిచేశారని 'టైమ్స్ నౌ' ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ శివశంకర్ తేల్చేశారు. వీక్షకులను తనవైపుకు తిప్పుకునేందుకు, అనేకమందిలో భావోద్వేగాన్ని నింపేందుకు అతడు చేసిన తతంగమే ఇదంతా! సీఎన్ఎన్ న్యూస్ 18 ప్రసారం చేసిన 'ఫుల్ జహంగీర్‌పురి ప్లాట్' కథనం కూడా అలాంటిదే. అల్లర్ల వెనుక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా' హస్తముందని 'న్యూస్ 18' రెచ్చగొట్టే కథనం ప్రసారం చేసింది. చిన్న చిన్న దుకాణాలు, వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న హిందూ, ముస్లింలు ఎంతోమంది ఉపాధి కోల్పోయారని, నష్టపోయారన్న సంగతి పై న్యూస్ ఛానళ్లు విస్మరించాయి.