Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరిద్వార్‌లో ఏం చేశారో మీకు తెలియదా? : సుప్రీంకోర్టు
- హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం
న్యూఢిల్లీ : ఒక వర్గం వారిపై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్న 'ధర్మ్ సన్సద్' సభలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇస్తారంటూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాలు అడ్డుకోవటంపై పూనావాలా వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు (2018లో) స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసిందని, వాటిని పాటించాలన్న సంగతి మీకు తెలియదా? అంటూ హిమాచల్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల్ని ప్రశ్నించింది. హరిద్వార్‌లో ధర్మ్ సన్సద్ వ్యవహారం అంతా తెలిసుండీ.. మళ్లీ వారి సభలకు ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రశ్నించింది. ఉనా (హిమాచల్ ప్రదేశ్), రూర్కీ (ఉత్తరాఖండ్)లలో తలపెట్టిన ధర్మ్ సన్సద్లలో విద్వేష ప్రసంగాలు వెలువడితే, అందుకు రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులే బాధ్యత వహించాలని హెచ్చరించింది. గత ఏడాది డిసెంబర్ 19-21 మధ్యకాలంలో హరిద్వార్‌లో జరిగిన ధర్మ్ సన్సద్లో సభకు హాజరైనవారు విద్వేష వ్యాఖ్యలు చేశారు. ఒక వర్గం వారిని చంపాలంటూ హిందువుల్ని రెచ్చగెట్టేలా ప్రసంగించారు. ఈ అంశంపై మంగళవారం విచారణ జరిపిన సుప్రీం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు పలు హెచ్చరికలు చేసింది. విద్వేష ప్రసంగాల్ని అడ్డుకునేందుకు తీసుకున్న నిరోధక చర్యలేంటో తెలపాలని, అఫిడవిట్ దాఖలు చేయాలంటూ హిమాచల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉనాలో 'అఖిల భారతీయ సంత్ పరిశద్' పేరుతో వివాదాస్పద సన్యాసి యతి నర్సింగానంద్ సభను నిర్వహించబోతున్నారు. ఇలాంటిదే రూర్కీలోనూ నిర్వహించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
పిటిషనర్ల తరఫున హాజరైన కపిల్ సిబాల్ మాట్లాడుతూ..''ఉనాలో ధర్మ్ సన్సద్ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంబంధిత జిల్లా కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారి దృష్టికి తీసుకొచ్చినా..చర్యలు శూన్యం''అని చెప్పారు. సుప్రీంకోర్టు గతంలో పూనావాలా కేసులో ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తున్నారా? అని ధర్మాసనం హిమాచల్ ప్రభుత్వ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. విద్వేష ప్రసంగాలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపర్చాలని సుప్రీంకోర్టు పోలీస్ ఉన్నతాధికారులకు తెలిపింది. సభ జరగకుండా అడ్డుకోవటంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం విఫలమైందని ఎ.ఎం.ఖాన్వికార్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.