Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని సరోజిని నగర్లో దాదాపు 200 నివాసాల కూల్చివేతను నిలుపుచేస్తూ సుప్రీం కోర్టు సోమవారం స్టే ఇచ్చింది. మే 2 వరకు ఎలాంటి బలవంతంపు చర్యలు తీసుకోరాదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రారులతో కూడిన బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఆయా ఇండ్లల్లో నివసిస్తున్న ప్రజల పట్ల మానవీయంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా, పునరావాసానికి మీరు ఒక విధానమంటూ లేదని చెప్పలేరు, వారిని విసిరవేయలేరు.'' అని అదనపు సొలిసిటర్ జనరల్ కె.ఎం.నటరాజన్‌తో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ పట్టణ ఆశ్రయ మెరుగుదల బోర్టు (డీయూఎస్ఐబీ), ఢిల్లీ పోలీసు కమిషనర్లకు బెంచ్ నోటీసులు జారీ చేసింది. డీయూఎస్ఐబీ చట్టం-2010 కింద ఈ నివాసాలు నోటిఫై చేయబడలేదని, అందువల్ల వారు పునరావాసానికి అర్హులు కారని స్లమ్ బోర్డు పేర్కొనడాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారి పునరావాసంపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయడానికి ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను బెంచ్ విచారించింది. వారం రోజుల్లోగా ఇళ్ళను ఖాళీ చేయాల్సిందిగా అక్కడి ప్రజలందరికీ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ నెల 4న నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 11న ఈ నివాసాలను కూల్చి వేయాల్సివుంది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ మాట్లాడుతూ, ఈ కూల్చివేత జరిగితే వేలాదిమంది ప్రజలు ఎక్కడికెళ్ళాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. అందువల్ల వారి నివాసాలను కూల్చివేయరాదని అన్నారు.