Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ నెల 30లోగా సమాధానమివ్వాలి
- కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం
- ఎటువంటి వాయిదా ఇవ్వబోమని స్పష్టం
- మే 5న తదుపరి విచారణ
న్యూఢిల్లీ : రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 30లోగా సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం కేసును మే 5న తుది విచారణకు జాబితా చేయాలని నిర్ణయించింది. ఎటువంటి వాయిదా ఇవ్వబోమని స్పష్టం చేసింది.
'ఈ వారం చివరిలోగా స్పందన దాఖలు చేయాలని మేం కేంద్రాన్ని ఆదేశిస్తున్నాం. మే 5న ఎలాంటి వాయిదా లేకుండా తుది పరిష్కారానికి సంబంధించిన అంశాన్ని జాబితా చేయండి' అని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐపీసీలోని సెక్షన్ 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ, దానిని రద్దు చేయాలని కోరుతూ రెండు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రిటైర్డ్ ఆర్మీ మేజర్ జనరల్ ఎస్జి వోంబట్కేరే, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లి ధర్మాసనం విచారణ జరుపుతున్నది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్‌లు, కార్టూన్లను పోస్టు చేసిన ఇద్దరు జర్నలిస్టులు కిషోర్‌చంద్ర వాంగ్ఖేంచా, కన్హయ్య లాల్ శుక్లాపై గత ఏడాది ఏప్రిల్‌లో రాజద్రోహ నేర అభియోగాలు మోపిన తరువాత ఈ నిబంధనపై సవాల్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణపై ఒక వ్యక్తి హక్కును ఇది ఉల్లంఘిస్తుందనే కారణంతో వారు ఈ నిబంధనను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
2021 జూలైలో ఈ అంశంపై నోటీసు జారీచేసిన సుప్రీంకోర్టు స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత ఈ చట్టం అవసరమా? అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బ్రిటిష్ వలస పాలకులు దేశ స్వాతంత్య్ర సమర యోధులను అణచివేసేందుకు ఉపయోగించిన నిబంధనను ఎందుకు రద్దు చేయడంలేదని అత్యున్నత న్యాయస్థానం గత సంవత్సరం ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రస్తుతం ఈ నిబంధన దుర్వినియోగమవుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు మహాత్మా గాంధీ, బాలగంగాధర తిలక్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల గొంతును అణిచివేసేందుకు బ్రిటిష్ వారు ఈ నిబంధనను ఉపయోగించారని కోర్టు ఎత్తిచూపింది. మరొకరి అభిప్రాయాలను ఎవరైనా ఇష్టపడనప్పుడు, కార్యనిర్వాహక విభాగం నుంచి జవాబుదారీతనం లేనప్పుడు అది దుర్వినియోగం చేయబడుతున్నదని సీజేఐ ఎన్వి రమణ అన్నారు. నేరారోపణలు రుజువవుతున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపింది. ఐపీసీ సెక్షన్ 124ఏ ఎంతగా దుర్వినియోగమవుతుందంటే.. ఓ వడ్రంగి చేతికి రంపం ఇస్తే, ఆయన చెట్టును కోయడానికి బదులుగా, మొత్తం అడవిని కోసినట్టు ఉందని వ్యాఖ్యానించింది. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఈ కేసుల సంఖ్య 93, అంటే అంతకుముందు కన్నా 160 శాతం పెరుగుదల కనిపించింది. 2019లో 3.3 శాతం కేసులు మాత్రమే రుజువయ్యాయి. కేవలం ఇద్దరు నిందితులపై మాత్రమే నేరం రుజువైంది.
రాజద్రోహం నిబంధన రద్దుపై స్పందించేందుకు సమయం కోరిన కేంద్రం
రాజద్రోహం నేరం గురించి చెప్తున్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 124ఏ రాజ్యాంగ బద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టుకు తెలిపింది. దీంతో అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఈ వారాంతం వరకు గడువు ఇచ్చింది. మే 5న తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది.