Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదు
- దాని సవాళ్లను ఇంకా అధిగమించలేదు
- కోవిడ్ బారిన పడకుండా చూసే రక్షణ కవచం వ్యాక్సిన్లే
- అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వాలి : ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ
- ఆ 8 రాష్ట్రాల్లో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని సూచన
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 ముప్పు పూర్తిగా తొలగిపోలేదనీ, అంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని కోవిడ్ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాలుగో వేవ్ వచ్చే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతుండగా, దేశంలో కొత్తగా కరోనా కేసులు రోజుకు దాదాపు 3 వేలకు చేరుతున్న నేపథ్యంలో ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ అంశాలపై చర్చించారు. ఫోర్త్ వేవ్ వస్తే తీసుకోవాల్సిన చర్యలు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇతర దేశాలతో పోలిస్తే కోవిడ్ సంక్షోభాన్ని మనం సమర్ధవంతంగా ఎదుర్కొన్నామనీ, ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కోవిడ్ సవాళ్లను ఇంకా అధిగమించలేదనే విషయం మాత్రం చాలా స్పష్టమని అన్నారు. దేశంలోని వయోజనుల్లో 96 శాతం మంది కనీసం ఒకటి లేదా రెండు డోసులు తీసుకోవడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు. 15 ఏండ్లు పైబడిన అర్హులైన వారిలో 85 శాతం మంది రెండో డోస్ తీసుకున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించాలని సీఎంలకు సూచించారు. అర్హత కలిగిన పిల్లలందరికీ సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రక్రియకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆసుపత్రుల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని ప్రత్యేకంగా కోరారు. ఈ ఛాలెంజ్‌ని ఎదుర్కొనేందుకు మన ఏర్పాట్లు సమగ్రంగా ఉండాలని, మన ప్రతిస్పందన సమయం కనిష్టంగా ఉండాలని ఆయన అన్నారు.
ఆ 8 రాష్ట్రాలు పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలి
పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందనీ, పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కూడా కోరామని ప్రధాని మోడీ అన్నారు. కొన్ని రాష్ట్రాలు పన్నులను తగ్గించాయనీ, అయితే కొన్ని రాష్ట్రాలు ప్రజలకు ప్రయోజనాలను అందించలేదని విమర్శించారు. ఈ రాష్ట్రాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని, దీనివల్ల ఆయా రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరగడమే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా నష్టం వాటిల్లుతున్నదని అన్నారు. కర్నాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం పన్ను తగ్గింపును చేపట్టాయనీ, వారి పొరుగు రాష్ట్రాలు పన్ను తగ్గించకుండా ఆదాయాన్ని ఆర్జించాయని ఆయన అన్నారు. అదేవిధంగా, గత నవంబర్‌లో వ్యాట్‌ను తగ్గించాలని కోరామనీ, అయితే మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, జార్ఖండ్ వంటి అనేక రాష్ట్రాలు కొన్ని కారణాల వల్ల అలా చేయడం లేదని ప్రధాని మోడీ అన్నారు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 42 శాతం రాష్ట్ర ప్రభుత్వాలకే దక్కుతుందని పేర్కొన్నారు.