Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రులతో సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ : ఇంధన ధరలపై ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దేశంలో కోవిడ్ పరిస్థితిపై ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో ప్రధాని ఇంధన ధరల సమస్యను లేవనెత్తుతూ రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించాలని తెలిపారు. దీంతో ప్రతిపక్షాలు పై విధంగా స్పందించాయి. ఇటు ప్రతిపక్షాలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు లీటర్ పెట్రోల్‌పై రెండింతలు సంపాదిస్తున్నాయని ఆరోపించింది.
గతేడాది నవంబర్‌లో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజీల్‌పై వ్యాట్‌ను తగ్గించలేదని ప్రధాని చెప్పడంతో.. రాష్ట్రానికి కేంద్రం రూ. 26,500 కోట్లు బకాయిపడిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. మహారాష్ట్రపై కేంద్రం వివక్ష చూపుతున్నదనీ, ఇంధన ధరల పెరుగుదలకు రాష్ట్రప్రభుత్వం బాధ్యత వహించదని థాక్రే ఆరోపించారు. పెట్రోల్, డీజీల్‌పై పన్ను ద్వారా మోడీ ప్రభుత్వం వసూలుచేసిన రూ. 27 లక్షల కోట్లకు లెక్క చెప్పాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజీల్ ద్వారా కేంద్రం ఆదాయం ఎనిమిదేండ్లలో రెండింతలు పెరిగిందని ఆయన వరుస ట్వీట్లు చేశారు. కోవిడ్ సమావేశాన్ని రాజకీయం కోసం ఏర్పాటు చేశారని శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. పన్నుల ద్వారా రూ. 26 లక్షల కోట్లు వసూలు చేసిన తర్వాత, పెట్రోల్‌పై 531 శాతం, డీజీల్‌పై 206 శాతం ఎక్సైజ్ సుంకాన్ని పెంచిన తర్వాత పన్నుల ద్వారా రూ. 26 లక్షల కోట్లు వసూలు చేసిన కేంద్రం లాభాల్లో ఒక్క రూపాయి కూడా పంచలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ పేర్కొన్నారు. పైగా ప్రధాని రాష్ట్రాలను వ్యాట్ తగ్గించి ప్రజలకు ప్రయోజనాలు పంచాలని చెప్తున్నారని వివరించారు. 'లాభం నాది.. నష్టం మీది' అనేది బీజేపీ సిద్ధాంతమని ఆయన ట్వీట్ చేశారు.