Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘాల నిర్ణయం:
- ఎఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు
- ఎ.విజయ రాఘవన్, బి.వెంకట్
న్యూఢిల్లీ: దేశంలో వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మే 16న జాతీయ సదస్సు నిర్వహిస్తామని ఎఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. విజయ రాఘవన్, బి.వెంకట్ తెలిపారు. వ్యవసాయ కార్మికుల సంఘాల ఉమ్మడి సమావేశం బుధవారం జీఎస్ గోరియా అధ్యక్షత బీకేఎంయూ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఆల్ ఇండియా అగ్రికల్చరల్ వర్కర్స్ యూనియన్ (ఎఐఏడబ్ల్యూయూ) నేతలు బి. వెంకట్, సునీత్ చోప్రా, విక్రమ్ సింగ్, వి శివదాసన్, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) నేత జీఎస్ గోరియా, ఆల్ ఇండియా అగ్రికల్చరల్ అండ్ రూరల్ లేబర్ అసోసియేషన్ (ఎఐఎఆర్ఎల్ఎ) నేత ధీరేందర్ ఝా, ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ సభ (ఏఐఎస్ కేఎస్) నేత కర్నైల్ సింగ్ ఇకోలాహా, అఖిల భారత అగ్రగామి కృషి శ్రామిక్ యూనియన్ (ఎఐఏకేఎస్ యు) నేత దర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వ్యవసాయ కార్మికుల పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లపై కూలంకషంగా చర్చించారు. అనంతరం ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎఐఏడబ్ల్యూయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. విజయ రాఘవన్, బి.వెంకట్ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై జాతీయ సదస్సును నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘాలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు తెలిపారు. మే 16న హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో జాతీయ సదస్సు జరగనున్నట్టు వెల్లడించారు. ఈ సదస్సును ప్రముఖ జర్నలిస్ట్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (పీఏఆర్ఐ) వ్యవస్థాపకులు పి. సాయినాథ్ ప్రారంభిస్తారని తెలిపారు. వ్యవసాయంలో యాంత్రీకరణ, లేబర్ టెక్నాలజీని విచక్షణారహితంగా ఉపయోగించడంతో వ్యవసాయంలో పని దినాలు తగ్గాయని పేర్కొన్నారు.