Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలోనే అతిపెద్ద ఐపీఓ
- మే 4నుంచి ఇష్యూ.. 17న లిస్టింగ్
- ఛైర్మన్ ఎంఆర్ కుమార్ వెల్లడి
- ఆకర్షణీయ విలువగట్టాం : దీపమ్ సెక్రటరీ
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ మే4న రానుందని అధికారికంగా ప్రకటించారు. ముంబయిలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఎల్ఐసీ చైర్మెన్ ఎంఆర్ కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసీ 3.0తరం ప్రారంభమయ్యిందన్నారు. సంస్థను స్థాపించిన తొలి రెండు దశాబ్దాల్లో దేశంలో బీమా విక్రయం చాలా కష్టంగా ఉండేదని.. అది ఎల్ఐసీ 1.0 తరమని అభివర్ణించారు. ఇక ఈ రంగంలోకి ప్రయివేటు సంస్థలకు ప్రవేశం కల్పించగా.. ఇప్పటి వరకు ఎదుర్కొన్న పోటీ కాలాన్ని ఆయన ఎల్ఐసీ 2.0 తరంగా పేర్కొన్నారు. ఇక ఎల్ఐసీ 3.0 కాలం ప్రారంభమయ్యిందన్నారు.
ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ)లో మే 2న యాంకర్ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించామన్నారు. మే 4 నుంచి 9వ తేది వరకు సాధారణ ప్రజలకు బిడ్డింగ్ తెరిచి ఉంటుందన్నారు. రూ.10 ముఖ విలువ కలిగిన షేర్ల ధరల శ్రేణీని రూ.902-949గా నిర్ణయించామన్నారు. పాలసీదారులకు రూ.60, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 రాయితీ అందిస్తున్నామన్నారు. మే 17న స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానుందన్నారు. కనీసం 15 ఈక్విటీ షేర్లకు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. గరిష్ట ధర వద్ద కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి మే 16న షేర్లు బదిలీ అవుతాయి.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ పాండే మాట్లాడుతూ దీర్ఘకాల దృష్టితో ప్రభుత్వం ఎల్ఐసీ ఐపీఓ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా సరైన పరిమాణంలోనే వాటాల విక్రయం జరుగుతుందన్నారు. 3.5 శాతం వాటాకు సరిపడ రూ.20,557 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మకానికి ఉంచుతున్నామన్నారు. ఎల్ఐసీ మిగులు విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కించడం జరిగిందన్నారు. దేశంలో ఇదే అతిపెద్ద ఐపీఓగా నిలువనుందన్నారు. ఈ ఇష్యూలో మొత్తంగా 22.13 కోట్ల షేర్లను విక్రయిస్తోంది. ఎల్ఐసీ ఉద్యోగుల కోసం 15.81 లక్షల షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కో షేర్‌పై రూ.45 డిస్కౌంట్ అందిస్తుంది. ఎల్ఐసీకి 13 లక్షల మంది ఏజెంట్లు, 29 కోట్ల మంది పాలసీదారులు ఉన్నారు. దేశంలో రెండు డజన్ల పైగా ప్రయివేటు బీమా కంపెనీలున్నప్పటికీ.. 61.6 శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా కొనసాగుతున్నది. ఈ సమావేశంలో కొటాక్ మహీంద్రా కాపిటల్ కంపెనీ సీఈఓ ఎస్ రమేష్, దీపమ్ జాయింట్ సెక్రటరీ అలోక్ పాండే, గోల్డ్‌మాన్ సాచే ఇండియా ఛైర్మన్ సంజరు చటర్జీ పాల్గొన్నారు.