Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : దేశంపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 7 గంటలకే సూరీడు చురుక్కుమంటున్నాడు. బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు. భారత్ ఎన్నడూ లేనంతగా వేడి వాతావరణాన్ని చవిచూస్తోంది. పలు రాష్ట్రాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా, యూపీ, ఒడిశాలోని పలుప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు వేడి గాలులు ఉండవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఐదు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది. వచ్చే మూడు రోజుల్లో వాయువ్య భారత్‌లో చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని, ఆ తర్వాత ఈ వేడి తగ్గవచ్చునని పేర్కొంది. ఆ ఐదు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగినందున.. వడగాల్పులు వీచే అవకాశాలెక్కువగా ఉన్నాయని హెచ్చరించింది. ఆ తర్వాత వర్షాలు పడే అవకాశాలున్నట్టు తెలిపింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోనూ 45 డిగ్రీలకు పైగా ఉష్ణ్గోగ్రతలు నమోదయ్యాయి.భారత్‌లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో పాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో విద్యుత్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 20 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉందని, రాష్ట్రంలోని కీలక ధర్మల్ పవర్ ప్లాంట్లలో 2 రోజుల్లోపు బగ్గు ఖాళీ అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు. కరెంట్ కొరతతో రాజస్తాన్‌లో కర్మాగారాలకు నాలుగు గంటల విద్యుత్ కోతలు విధించారు. కాగా, ఇప్పటికే గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ల్లో విద్యుత్ కొరత కారణంగా పరిశ్రమల్లో కోతలు మొదలయ్యాయి. అటు కాశ్మీరం కూడా ఎండకి తట్టుకోలేకపోతోంది. అక్కడ సైతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు, నీటి సంక్షోభం ఏర్పడింది.