Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే మతపరమైన వ్యూహం
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ల విధ్వంసక బుల్డోజర్ రాజకీయాలు
- ప్రజల ఐక్యతతో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం
- ప్రజల రోజువారీ సమస్యలపై ఆందోళనలు
- జీవనోపాధి రక్షణ కోసం పోరాటం ఉధృతం: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- ఆర్ఎస్ఎస్, బీజేపీ విభజన, మత దాడులకు వ్యతిరేకంగా జంతర్ మంతర్‌లో ఆందోళన
న్యూఢిల్లీ : తమ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడంలో భాగంగానే కేంద్రంలోని అధికార బీజేపీ మతపరమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీల నిరంతర విభజన, మత దాడులకు వ్యతిరేకంగా గురువారం జంతర్ మంతర్‌లో వామపక్షాలు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ ఢిల్లీ రాష్ట్ర కమిటీలు ఆద్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ నిరసనలో వందలాది మంది వామపక్ష కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ ఆందోళనలో మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజల ఐక్యత, జీవనోపాధికి రక్షణ కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలనే తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సహా ప్రతిరంగంలో తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ మతపరమైన వ్యూహాన్ని ఉపయోగిస్తోందని విమర్శించారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంతో పాటు, ప్రజల రోజువారీ సమస్యలపై ఆందోళనలను మరింత తీవ్రతరం చేయాలని పిలుపు ఇచ్చారు. అధికార బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ''విధ్వంసక బుల్డోజర్ రాజకీయాలు'' చేస్తున్నాయని ధ్వజమెత్తారు. జహంగీర్‌పురిలోని ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉందనీ, ఆ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతను సృష్టించే ప్రణాళికలో భాగంగానే దాడులు జరిగాయని విమర్శించారు. ఢిల్లీలో ఆక్రమణల వ్యతిరేక డ్రైవ్‌లు ద్వేషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. ఇటువంటి కార్యకలాపాలను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ మాట్లాడుతూ జహంగీర్‌పురిలో విధ్వంసక చర్య ఆ ప్రాంతంలో మొదటి హనుమాన్ జయంతి పేరుతో సాయుధ ఊరేగింపు ద్వారా మత సామరస్యాన్ని చెడగొట్టడంలో మతోన్మాద మూకలు ప్రయత్నించాయని విమర్శించారు. బుల్డోజర్ శ్రామికవర్గ కుటుంబాల ఆస్తిపై మాత్రమే కాకుండా, రాజ్యాంగ ప్రధాన భావనపై నడుస్తుందని పేర్కొన్నారు. దేశంలో బుల్డోజర్ పాలన సాగుతోందని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్జీత్ కౌర్ మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు మతతత్వ విధానాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా దాడులు పెరిగాయని, మైనార్టీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను గాలికొదిలి, మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు.
సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ పొలిట్ బ్యూరో సభ్యురాలు కవితా కృష్ణన్ మాట్లాడుతూ జహంగీర్‌పురిలో ఇలా జరగడం చూశామనీ, ఇప్పుడు దేశ రాజధానిలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించాలని యోచిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి పద్ధతులకు స్వస్తి పలకాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి కెఎం తివారీ, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు ఆశాశర్మ, సీపీఐ-(ఎంఎల్) లిబరేషన్ ఢిల్లీ కార్యదర్శి రవి రారు తదితరులు పాల్గొన్నారు.