Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లింగ్ కోసం 100కిలోలు ఇస్తే..నాఫెడ్‌కు 65కిలోలు
- రూ.వందల కోట్లు మింగుతున్న పెద్ద పెద్ద మిల్లర్లు
- సంక్షేమ పథకాలకు, సైన్యానికి నాణ్యతలేని పప్పులు సరఫరా
- కుంభకోణాన్ని బయటపెట్టిన ప్రభుత్వ ఏజెన్సీ 'నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్'
- టెండర్ ప్రక్రియ, కేంద్రం పర్యవేక్షణ లోపం వల్లే..
న్యూఢిల్లీ : కందులు, పెసర్లు మినుములు..ఇలా రకరకాల పప్పులకు సంబంధించి 'నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్' (నాఫెడ్) చేపడుతున్న మిల్లింగ్ ప్రక్రియ దేశంలోని పెద్ద పెద్ద మిల్లు యజమానులకు వరంగా మారింది. వందల కోట్ల రూపాయల్ని దిగమింగటమేగాక, మిల్లింగ్ తర్వాత నాణ్యతలేని పప్పులు నాఫెడ్‌కు సరఫరా అవుతోంది. ఈ నాణ్యతలేని పప్పులు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు, సైన్యంలో సైనికులకు అందుతోందని, సుమారుగా రూ.4600కోట్లకు పైగా విలువైన పప్పుల మిల్లింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ 'నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్' తేల్చింది.
భారీ కుంభకోణానికి సంబంధించి కీలకమైన నివేదిక కేంద్ర వాణిజ్యమంత్రి పియూష్ గోయల్‌కు కొద్దిరోజుల క్రితమే అందింది. నాఫెడ్ చేపడుతన్న లోపభూయిష్టమైన టెండర్ ప్రక్రియ, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటం భారీ కుంభకోణానికి కారణమని 'నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్' తన నివేదికలో తేల్చింది. 2018 నుంచి నాఫెడ్ అనుసరిస్తున్న టెండర్ ప్రక్రియను తప్పుబట్టింది. నివేదికలోని కీలక విషయాల్ని 'ద రిపోర్టర్స్ కలెక్టీవ్' సేకరించింది. దాంతో ఈవిషయాలు జాతీయ మీడియా, న్యూస్ వెబ్‌పోర్టల్స్‌లో వార్తా కథనాలుగా వెలువడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పనేంటి?
దేశవ్యాప్తంగా రైతుల నుంచి కందులు, పెసర్లు, మినుములు, శనగలను ముడి పప్పుల రూపంలో నాఫెడ్ సేకరిస్తోంది. వీటిని మిల్లుల్లో దంచి(మిల్లింగ్), ప్రాసెస్ చేసి..కంది పప్పు, పెసర పప్పు, శెనగ పప్పుగా మార్చేందుకు 'నాఫెడ్' ప్రతిఏటా పెద్ద ఎత్తున టెండర్లను పిలుస్తోంది. ప్రతిఏటా పెద్ద పెద్ద మిల్లు యజమానులకు మాత్రమే ఈ టెండర్లు దక్కుతున్నాయి. టెండర్లలో పోటీకి ఆస్కారం లేకపోవటం, మిల్లు యజమానులు ఇచ్చే కొటేషన్‌కు నాఫెడ్ ఓకే చెప్పటం గతకొన్నేండ్లుగా జరుగుతోంది. 'నాఫెడ్' ఎంచుకున్న టెండర్ ప్రక్రియ లేదా వేలంపాట మిల్లు యజమానులకు రూ.వందల కోట్ల లాభాలు కురిపిస్తోందని స్వయంగా 'నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్' తేల్చింది. అక్టోబర్ 2021లో రూ.875 కోట్ల విలువజేసే 1,37,509 మెట్రిక్ టన్నుల పప్పుల మిల్లింగ్ కోసం నాఫెడ్ టెండర్లు పిలిచింది. మిల్లింగ్ తర్వాత నాఫెడ్‌కు నాణ్యతలేని పప్పులు సరఫరా అయ్యాయని విచారణలో తేలింది. దాంతో ఇకముందు ముడి పప్పు దినుసుల్ని నేరుగా రాష్ట్రాలకే పంపిణీ చేసి, అక్కడే మిల్లింగ్ చేపట్టాలని నాఫెడ్ భావిస్తోందట.
ఓటీఆర్‌లో ఉంది మర్మమంతా!
టెండర్ వేసేప్పుడు మిల్లు యజమానులు 'అవుట్ టర్న్ రేషియో' (ఓటీఆర్) కోట్ చేస్తాయి. అంటే..100కిలోల ముడిపప్పును మిల్లింగ్ చేయగా వచ్చే ఆహార ఉత్పత్తి ఓటీఆర్. ఉదాహారణకు 100కిలోల కందులకు మిల్లు యజమానులు 75 ఓటీఆర్‌తో కొటేషన్ ఇస్తున్నారు. మిల్లింగ్ తర్వాత 75కిలోల కందిపప్పు వస్తుందని అర్థం. సరుకు రవాణా, ఇతర ఖర్చుల కింద మరో 10కిలోలు మిల్లు యజమానికి నాఫెడ్ వదిలేస్తోంది. అటు తర్వాత నాఫెడ్‌కు సరఫరా అయ్యేది 65కిలోల కందిపప్పు. అందులోనూ నాణ్యతా లోపం పెద్దఎత్తున ఉంటోంది. మిల్లింగ్ ప్రక్రియ అనంతరం నాణ్యమైన పప్పును మిల్లు యజమానులు తమవద్దే అట్టిపెట్టుకొంటున్నారు. నాణ్యతలేని సరుకును రాష్ట్రాలకు(ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద), సైన్యానికి సరఫరా చేస్తున్నారు. తద్వారా వందలకోట్ల విలువజేసే ఆహార ఉత్పత్తి కొద్దిమంది మిల్లు యజమానులు మింగేస్తున్నారని 'నేషనల్ ప్రొడక్టవిటీ కౌన్సిల్' అభిప్రాయపడింది.