Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : పెట్రోల్, డీజిల్‌లపై అమ్మకపు పన్నును తగ్గించాల్సిన అవసరం లేదని కేరళ ఆర్థిక శాఖ మంత్రి కె.ఎన్ బాలగోపాలన్ స్పష్టం చేశారు. తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఆరేండ్లుగా పెట్రోల్, డీజిల్‌లపై రాష్ట్రం అమ్మకపు పన్నును పెంచలేదని.. అప్పుడు తగ్గించాల్సిన అవసరం ఏముందని అన్నారు. కేంద్రం ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలు ఇంధన ధరలపై అమ్మకం పన్నును తగ్గించడం లేదంటూ ప్రధాని బుధవారం బహిరంగంగా విమర్శిలు గుప్పించిన సంగతి తెలిసిందే. గతేడాది నవంబర్4న కేంద్రం పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని అన్నారు. ప్రధాని ఇచ్చిన సమాచారం పూర్తిగా పక్కదారి పట్టించేవిధంగా ఉందని బాలగోపాలన్ అన్నారు. ఎల్డిఎఫ్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం ఇంధన ధరలపై అమ్మకపు పన్నును ఒక్కసారి తగ్గించిందని. ఆతర్వాత తగ్గించాల్సిన అవసరం లేదని అన్నారు. యుడిఎఫ్ ప్రభుత్వ హయాంలో అమ్మకం పన్ను పెట్రోల్‌పై 31.80 శాతం, డీజిల్‌పై 24.75 శాతం ఉండగా, 2018లో ఎల్డిఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పెట్రోల్‌పై 30.80 శాతం, డీజిల్‌పై 22.7 శాతానికి తగ్గించిందని అన్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ రెండింటిపై ఒక శాతం ఇంధన సెస్‌తో పాటు లీటరుకి రూపాయి అదనపు అమ్మకపు పన్నును కేంద్రం విధించడం వల్ల, రాష్ట్రంపై అధికారిక లెక్కల ప్రకారం సుమారు రూ.1500 కోట్ల భారం పడిందని అన్నారు. 2017లోఎక్సైజ్ సుంకం రూ.9 గా ఉండగా.. ప్రస్తుతం లీటరుకి రూ.31గా ఉందన్నారు. ఎక్సైజ్ సుంకంలో 41 శాతం రాష్ట్రాలకు ఇవ్వాల్సింది పోయి కేంద్రం లాగేసుకుంటుందని పేర్కొన్నారు. సెస్‌లతో పాటు అదనపు పన్నులను విధించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 271 ప్రకారం యుద్ధం, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తుల్లో మాత్రమే సెస్‌లు విధించాలని స్పష్టం చేసిందని అన్నారు. ఇప్పటికే జీఎస్టీ విధించే అధికారం రాష్ట్రాలకు పోయిందని అన్నారు. మద్యం, ఇంధన ధరలు మాత్రమే రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయని, వాటి పై కూడా సెస్, సర్‌చార్జీలను విధించి మోడీ సర్కార్ దోచుకుంటోందని మండిపడ్డారు.