Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నడిరోడ్డుపై 90 ఏండ్ల పద్మశ్రీ గ్రహీత
న్యూఢిల్లీ : ప్రభుత్వ వసతి గృహంలో ఉంటున్న 90 ఏండ్ల ఒడిస్సీ నృత్యకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీతను కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబెట్టింది. ఎంతో అమానవీయంగా ప్రవర్తించింది. వసతి గృహంలో ఉండేందుకు గడువు పూర్తయిందని చెబుతూ.. అతనిని హఠాత్తుగా ఖాళీ చేయించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆయన కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... ప్రముఖ నృత్యకారుడు గురు మయుధర్ రౌత్ గత కొన్నేండ్లుగా.. ఢిల్లీలోని ఏషియన్ గేమ్స్ విలేజ్‌లో ప్రభుత్వం కేటాయించిన వసతి గృహంలో ఉంటున్నారు. ఆయనతోపాటు పలువురు ప్రముఖ కళాకారులు కూడా.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్నారు. అయితే వీరికి కేటాయించిన వసతుల్ని 2014 లో రద్దు చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా... ఈ కళాకారులంతా కోర్టును ఆశ్రయించారు. అయితే వీరు కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. కేసు ఓడిపోయింది. ఇక చేసేదేమీ లేక చాలామంది కళాకారులు బంగళాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మిగిలిన వారిని ఈ నెల 25లోగా ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే మయుధర్ రౌత్ తాను ఉంటున్న బంగళాను ఖాళీ చేయకపోవడంతో.. అధికారులు వచ్చి ఖాళీ చేయించారు. ఇంట్లోని సామానంతా రోడ్డున పడేశారు. ఆఖరికి పద్మశ్రీ పురస్కార పత్రం కూడా రోడ్డుపై వేశారు. ఇలా అతని సామాన్లను రోడ్డుపై కనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ ఘటనపై.. మయుధర్ కుమార్తె.. మధుమితా రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అధికారులు మా నాన్నను బంగ్లా నుంచి ఖాళీ చేయించడాన్ని నేను వ్యతిరేకించట్లేదు. కానీ అధికారులు ప్రవర్తించిన తీరు అమానవీయం. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఇంటి బెల్ మోగింది. అప్పుడు నేను మా నాన్నకు భోజనం పెడుతున్నాను. అధికారులు వచ్చి మమ్మల్ని బయటకు వెళ్లిపొమ్మన్నారు. పోలీసులు, కూలీలు వచ్చి.. మేం చూస్తుండగానే మా సామాన్లన్నీ వీధిలో పడేశారు. ఇదంతా చూసి మా నాన్న షాక్‌కి గురయ్యారు. అదృష్టవశాత్తూ..
ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. లేదంటే మానాన్న మరణించేవారే. తన నాట్యంతో ఎన్నో సేవలందించిన మా నాన్నకి ఇలాంటి అవమానం జరగడం బాధాకరం. ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన బ్యాక్ ఎకౌంట్లో కేవలం రూ. 3,000 రూపాయలే ఉన్నాయి. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న 8 మంది కళాకారులకు ఇల్లు ఖాళీ చేయమని మే 2 వరకు గడువు ఇచ్చినట్టు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీరందరికీ పలుమార్లు నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. తాము బంగళాలను ఖాళీచేసే పనిలోనే ఉన్నామని, అయితే కొంత సమయం కావాలని వారు కోరినట్టు పేర్కొన్నారు.