Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాక్సెస్ నౌ నివేదిక
న్యూఢిల్లీ : 3జీ, 4జీని దాటి 5జీలో అడుగుపెడుతున్న కాలంలో అసలు ఇంటర్నెట్ లేకపోవడాన్ని ఊహించుకోగలమా..? నెట్ నిమిషం పాటు స్లో అయినా, బఫరింగ్ వచ్చినా తట్టుకోలేం. అభిప్రాయాల వెల్లడికి గానీ, సమాచారాన్ని సత్వరమే చేరవేయడంలో గానీ ఇంటర్నేట్టే కీలకం. అలాంటిదీ 2021లో భారత ప్రభుత్వం 106 సార్లు ఇంటర్నెట్కు అంతరాయం కలిగించిందట. డిజిటల్ హక్కుల న్యాయవాద గ్రూప్ 'యాక్సెస్ నౌ' ఈ విషయాన్ని వెల్లడించింది. ఎన్నికలు, నిరసనలు, దేశ రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేసే సంఘటన సమయంలో అధికారులు.. ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పరచినట్టు ఈ నివేదిక తెలిపింది. భారత్లో ఇలా జరగడం ఇదేమీ కొత్త కాదు. ఇది వరుసగా నాల్గవ ఏడాది. దీంతో ప్రపంచం ముంగిట భారత్ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలున్న 34 దేశాల్లో 182 సార్లు ఇంటర్నెట్ను షట్డౌన్ కాగా, 2020లో 29 దేశాల్లో కనీసం 159 సార్లు ఇంటర్నెట్కు అంతరాయం ఏర్పరిచారు. ఇంటర్నెట్కు అంతరాయం కల్గించిన దేశాల్లో భారత్ తర్వాత మయన్మార్ ఉంది. ఇక్కడ 2021లో 15 సార్లు నెట్ షట్డౌన్ అయింది. ఆ తర్వాత స్థానాల్లో సూడాన్, ఇరాన్లున్నాయి. కోవిడ్ వ్యాప్తి తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో.. తిరిగి సాధారణ పరిస్థితులు రాగా, అప్పటి నుంచి ఇంటర్నెట్ షట్డౌన్లు మొదలయ్యాయని నివేదిక తెలిపింది. 2021లో సుదీర్ఘ కాలంగా, లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వాలు నెట్ షట్డౌన్కు పాల్పడ్డాయి. భారత్లో ప్రభుత్వ పాదర్శకత లోపించిన కారణంగా కొన్ని నెట్వర్క్ అంతరాయాలను సంబంధించిన నివేదిక కూడా సరిగా ఉండకపోవచ్చునని యాక్సెస్ నౌ తెలిపింది. షట్డౌన్కు సంబంధించిన డేటాను పొందుపరిచేందుకు కేంద్రం విముఖత చూపడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంది.
ఆర్థిక వ్యయం కూడా అదనమే
భారత్లో అధికారులు పదేపదే షట్డౌన్లు చేపట్టడంతో.. దేశంలో అసమర్థత పాలన ఎలా ఉందో పౌర సమాజం, డిజిటల్ హక్కుల కార్యకర్తలు విమర్శిస్తూనే ఉన్నారు. అయితే ఈ షట్డౌన్ కూడా భారీగా ఆర్థిక వ్యయం అవుతుంది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూటషన్ 2016లో చేపట్టిన విశ్లేషణ చూస్తే.. 2015-16లో భారత్లో షట్డౌన్ వల్ల భారతదేశానికి దాదాపు బిలియన్ డాలర్లు ఖర్చు అయింది. ఇది భారీ నష్టమే.