Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటాడుతున్న బొగ్గు కొరత
- ఢిల్లీలో మెట్రో, ఆస్పత్రులకు అంతరాయం ఏర్పడే పరిస్థితులు
- విద్యుదుత్పత్తి కర్మాగారాలకు బొగ్గు నిరంతరం అందిస్తున్నాం : ఎన్టీపీసీ
న్యూఢిల్లీ : థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలు విద్యుత్ అంతరాయంతో కొట్టుమిట్టాడుతున్నాయి. బొగ్గు కొరత సమస్యను ఎదుర్కొంటున్న ప్రధాన రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లలో ఆస్పత్రులు, మెట్రో రైళ్లకు అంతరాయం ఏర్పడేపరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని మెట్రో రైళ్లు, హాస్పిటల్స్‌కు విద్యుత్ సరఫరా చేయడంలో ఎదురుదెబ్బ తగులుతుందని కేంద్రాన్ని ఢిల్లీ ప్రభుత్వం హెచ్చరించింది. పరిస్థితిని అంచనా వేయడానికి విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దేశ రాజధానికి విద్యుత్ సరఫరాచేసే పవర్ ప్లాంట్లకు తగినంత బొగ్గు లభ్యత ఉండేలా చూడాలని అభ్యర్థిస్తూ కేంద్రానికి మంత్రి లేఖ రాశారు. 'దాద్రీ-2, ఉంచాహర్ పవర్ స్టేషన్ల నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా ఢిల్లీ మెట్రో, ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులతో సహా అనేక ముఖ్యమైన సంస్థలకు 24 గంటల విద్యుత్ సరఫరాలో సమస్య ఉండవచ్చు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది' అని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం.. ఢిల్లీలో విద్యుత్ డిమాండ్‌లో 30శాతం ఈ పవర్ స్టేషన్ల ద్వారా తీరుతుందనీ, అవి బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయని జైన్ తెలిపారు. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందనీ, రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూసేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు. మరోవైపు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కరెంట్ కోతలు మొదలయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్నిరోజులుగా దేశ రాజధానిలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40డిగ్రీల పైనే ఉంటున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే డిమాండ్‌కు తగినంత విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు బొగ్గు కొరత సమస్యగా మారిందని ప్రభుత్వం చెబుతోంది.
వ్యవసాయ రంగానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ రైతు సంఘం కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అమృత్‌సర్‌లో విద్యుత్ శాఖ మంత్రి ఇంటి ముందు నిరసన తెలిపింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 40శాతం పెరిగిందని పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి హర్భజన్ సింగ్ తెలిపారు. థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు కొరత కారణంగా జనసాంద్రత కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తీవ్రమవుతుంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్‌లో బొగ్గు సంక్షోభం కొనసాగుతున్నది.
వేసవి కాలంలో విద్యుదుత్పత్తికి డిమాండ్ పెరుగుతుండటంతో గత వారం నుంచి విద్యుదుత్పత్తి కర్మాగారాలకు తగినంత బొగ్గు అందుబాటులో ఉండటం లేదని చాలా రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రవాణా తదితర అంశాలకు సంబంధించిన సమస్యల వల్ల బొగ్గు సరఫరాలో వేగం తగ్గడంతో కొన్ని రాష్ట్రాలు లోడ్ షెడ్డింగ్ చేస్తున్నాయి.
విద్యుదుత్పత్తి కర్మాగారాలకు బొగ్గు నిరంతరం అందిస్తున్నాం : ఎన్టిపిసి
విద్యుదుత్పత్తి కర్మాగారాల్లో రెండు రోజులకు సరిపోయే బొగ్గు మాత్రమే అందుబాటులో ఉందని ఢిల్లీ ప్రభుత్వం చెప్తుండటంపై నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) స్పందించింది. దాద్రి-2, ఊంచహార్ పవర్ ప్లాంట్స్‌కు క్రమబద్ధంగా నిత్యం బొగ్గు సరఫరా అవుతోందని, ఈ రెండూ పరిపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఊంచహార్, దాద్రి స్టేషన్లు గ్రిడ్‌కు 100 శాతం కన్నా ఎక్కువ రేటెడ్ కెపాసిటిని తెలియజేస్తున్నాయని ఎన్టీపీసీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఊంచహార్ యూనిట్-1 మినహా ఊంచహార్, దాద్రిలోని అన్ని యూనిట్లు పరిపూర్ణ లోడ్ కెపాసిటితో పని చేస్తున్నట్టు తెలిపింది. ఊచహార్ యూనిట్ 1లో ప్రణాళిక ప్రకారం వార్షిక ఓవర్‌హాల్ జరుగుతోందని పేర్కొంది. దాద్రిలో ఆరు యూనిట్లు ఉన్నాయనీ, ఇవన్నీ సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నాయని తెలిపింది. అదేవిధంగా ఊంచహార్‌లో ఐదు యూనిట్లు సంపూర్ణ సామర్థ్యంతో పని చేస్తున్నట్టు వివరించింది. ప్రస్తుతం దాద్రి స్టేషన్లో 1,40,000 ఎంటిలు, ఊంచహార్‌లో 95,000 ఎంటిల బొగ్గు ఉందని తెలిపింది. నిత్యం క్రమబద్ధంగా బొగ్గు సరఫరా అవుతోందని పేర్కొంది. దిగుమతి చేసుకున్న బొగ్గును సరఫరా చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించింది.