Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రక్రియ కొనసాగుతున్నది : దీపమ్ సెక్రటరీ తూహిన్ పాండే
న్యూఢిల్లీ : ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపమ్) సెక్రటరీ తూహిన్ కాంత పాండే తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓ రోడ్‌షో సందర్బంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐడీబీఐ బ్యాంక్ ప్రయివేటీకరణకు కసరత్తు జరుగుతుందన్నారు. ఎల్ఐసీ రోడ్‌షోలు అయిపోగానే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా.. ఎంత వాటాలను విక్రయించేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అయితే సంస్థ మేనేజ్మెంట్ చేతులు మాత్రం తప్పక మారనున్నాయన్నారు. ఇందుకోసం ఓ విధానాన్ని రూపొందించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 45.48 శాతం, ఎల్ఐసీకి 49.24 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ వాటాల ఉపసంహరణకు గతేడాది మేలోనే క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
దీర్ఘకాల లక్ష్యంతోనే ఐపీఓ..
ఎల్ఐసీ ఐపీఓపై పాండే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దీర్ఘకాల ఎత్తుగడతోనే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. తొలుత 5శాతం వాటాలను విక్రయించాలని యోచించినప్పటికీ.. తుదకు 3.5 శాతం వాటా ఉపసంహరణకు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ ఇష్యూ ద్వారా రూ.20,557 కోట్ల నిధులు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాగా.. ఇప్పటి వరకు దేశంలో పేటియం ఐపీఓ రూ.18,300 కోట్లతో అతిపెద్దదిగా ఉంది. ఆ తర్వాత స్థానంలో కోల్ ఇండియా రూ.15,500 కోట్లు, రిలయన్స్ పవర్ 11,700 కోట్ల పెద్ద ఐపీఓల జాబితాలో ఉన్నాయి.