Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయనపై చేసిన ఆరోపణల్లో పస లేదు : మేవానీ తరఫు న్యాయవాది
- మొదటి కేసులో బెయిల్ ఇవ్వగానే..ఏదో ఒక ఆరోపణతో రెండో కేసు పెట్టారు..
న్యూఢిల్లీ : గుజరాత్ ఎమ్మెల్యే జిగేశ్ మేవానీకి రెండో కేసులో కోర్టు బెయిల్ మంజూర్ చేసింది. దేశ ప్రధాని నరేంద్రమోడీపై ట్విట్టర్ వేదికగా తీవ్రమైన విమర్శలు చేశాడన్న కేసులో జిగేశ్ మేవానీని తొలుత అసోంకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు.
ఈకేసులో అక్కడి న్యాయస్థానం బెయిల్ ఇవ్వగా, జిగేశ్ మేవానీపై బీజేపీ సర్కార్ మరో కేసు బనాయించి అరెస్టు చేసింది. ఇలా వరుస కేసులతో ఒక దళిత ఎమ్మెల్యేను జైలు పాలు చేయటం, అరెస్టులతో, కేసులతో బెదిరించటం జాతీయ వార్తల్లో చర్చనీయాంశమైంది. మరికొద్ది నెలల్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అతడిపై ఏదో ఒక విధమైన ముద్రవేయటం ద్వారా, అతడిపై ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీయాలన్నది బీజేపీ పాలకుల కుట్రగా కనపడుతోంది.మేవానీ తరఫు న్యాయవాది అంగుశ్మాన్ బోరా మాట్లాడుతూ..''రూ.1000 వ్యక్తిగత పూచికత్తుపై న్యాయస్థానం మేవానీకి బెయిల్ మంజూరు చేసింది. దీనిని బట్టి అసోంలో పోలీసులు పెట్టిన రెండో కేసు ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. మొదటి కేసుకు సంబంధించి మేవానీ కోక్రాజార్ (అసోం)కు వెళ్లి కొన్ని పనులు పూర్తిచేయాల్సి వుంటుంది. దీనికి ఒక రోజు పట్టొచ్చు. ఆ తర్వాత మేవానీ విడుదల అవుతారు'' అని మీడియాకు చెప్పారు. ప్రధాని మోడీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారన్న కేసులో కోర్టు బెయిల్ ఇవ్వగానే, ఆ వెంటనే ఏప్రిల్ 25న మరో కేసులో అసోం పోలీసులు మేవానీని మళ్లీ అరెస్టు చేయటం సంచలనం సృష్టించింది. రెండో కేసు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారన్న కేసులో అసోం పోలీసులు జిగేశ్ మేవానీని గౌహతీకి తరలించారు. అక్కడ్నుంచీ మేవానీకి బందోబస్తు కింద కోక్రాజర్ మహిళా ఎస్ఐ వ్యవహించారు. ఈక్రమంలో తనపై ఎమ్మెల్యే మేవానీ తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడారని మహిళా ఎస్ఐ బార్పేటా రోడ్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 21న ఫిర్యాదుచేశారు. తన విధులకు అడ్డువచ్చారని, తనపట్ల అభ్యంతరకరంగా వ్యవహరించారని ఫిర్యాదులో మహిళా ఎస్ఐ పేర్కొన్నారు. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం గుజరాత్లో జిగేశ్ మేవానీ అధికార బీజేపీకి కొరకరాని కొయ్యలా మారాడు. రాజకీయంగా ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఇదిలాగే కొనసాగితే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న నేపథ్యంలో, మేవానీపై బీజేపీ ప్రతీకార దాడులకు దిగిందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులు నమోదువుతున్నాయని విమర్శలు వ్యక్తమయ్యాయి.