Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మసీదుల్లోకి పంది మాంసం, అసభ్య పత్రాలు విసిరివేత
లక్నో : అయోధ్యలో హిందూత్వ మతత్వ శక్తులు రెచ్చిపోయాయి. నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న మసీదుల్లోకి పంది మాంసం, ముస్లింలపై అసభ్యంగా రాసిన ఉన్న పత్రాలు, పవిత్ర ఖురాన్‌లోని చింపివేసిన పేజీలను విసిరివేసాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇప్పటి వరకూ ఏడుగుర్ని అరెస్టు చేశారు. అరెస్టయిన ఏడుగురూ... హిందూ యోధ సంఘటన అనే సంస్థకు చెందిన వారని, ఈ గ్రూపు నాయకుడిపై నాలుగు క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు తెలిపారు. తాత్షా జామా మసీదు, ఘోసియానా మసీదు, కశ్మీర్ మెహల్లాలోని మసీదు, గులాబ్ షా బాబాగా పిలిచే మజార్‌లో మసీదుల్లో పై చర్యలకు హిందూత్వ శక్తులు పాల్పడ్డాయి. అయోధ్యలో మత హింసను సృష్టించి.. అల్లర్లను రెచ్చగొట్టాలని ప్రయత్నించినట్లు నిందితులు వాంగ్మూలమిచ్చినట్లు చెప్పారు. మంగళవారం అర్ధరాత్రి నిందితులు ఈ చర్యలకు పాల్పడినట్లు చెప్పారు. ఈ కుట్రలో పదకొండు మంది పాల్గొనగా... నలుగురు పరారీలో ఉన్నారని, ఏడుగుర్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడేందుకు వినియోగించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారి హిందు యోధ సంఘటన నాయకుడు మహేష్ మిశ్రా, సభ్యులు ప్రత్యూష కుమార్, నితిన్‌కుమార్, దీపక్ గౌడ్, బ్రాజేష్ పాండే, శత్రుఘ్న, విమల్పాండేగా పోలీసులు తెలిపారు. వీరంతా కోత్వాలి సిటీ పోలీస్‌స్టేషన్ ప్రాంతంలోని నివాసితులుగా గుర్తించారు. బేనిగంజ్ ప్రాంతంలోని మసీదులో కూడా ఈ వస్తువులు వేయాలని నిందితులు చూశారని, కానీ అక్కడ పోలీసులు గస్తీ తిరుగుతుండటంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారని పోలీసులు చెప్పారు.