Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు
- ఇది కోర్టుధిక్కరణకు దారితీస్తుంది
- న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరం
- న్యాయమూర్తులు లక్ష్మణ రేఖను దాటొద్దు
- విధి నిర్వహణలో పరిమితులు గుర్తించుకోవాలి
- రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల సీజేల సంయుక్త సమావేశంలో సీజేఐ ఎన్వి రమణ
న్యూఢిల్లీ : 'కోర్టు తీర్పులను తరచూ ప్రభుత్వాలు ఏండ్ల తరబడి అమలు చేయడంలేదు. ఇది కోర్టు ధిక్కరణ పిటిషన్‌కు దారితీస్తుంది. ఇది ప్రభుత్వ ధిక్కారానికి ప్రత్యక్ష ఫలితం. ఇది ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు' అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లెఫ్టినెంట్ గవర్నర్ల 11వ సంయుక్త సదస్సు శనివారంనాడిక్కడ విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ సీజేఐ ఎన్.వి రమణ మాట్లాడారు. విధి నిర్వహణలో న్యాయమూర్తులు తమ పరిమితులను గుర్తుంచుకోవాలనీ, లక్ష్మణ రేఖను దాటొద్దని సూచించారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలకు రాజ్యాంగం వేర్వేరు అధికారాలను కల్పించిందన్నారు. ప్రజాస్వామ్య బలోపేతానికి, సామరస్యంగా కార్యకలాపాలు సాగేందుకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దుర్వినియోగం అవుతున్నాయని సీజేఐ ఆందోళన వ్యక్తంచేశారు. కొందరు వీటిని 'పర్సనల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్'గా మార్చుతూ.. వ్యక్తిగత వివాదాల పరిష్కారానికి ఉపయోగించుకోవడం బాధాకరమన్నారు.
కోర్టుల్లో 56శాతం కేసులు నమోదవుతున్నా ప్రభుత్వమే అతిపెద్ద వ్యాజ్యమని తెలిపారు. దేశంలో న్యాయ వ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమన్నారు. న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం రెండు పరస్పర సహకారంతో ముందుకు వెళ్తే, ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన తీర్పులు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఉద్దేశపూర్వక చర్యలు ప్రజాస్వామ్యానికి అంత ఆరోగ్యకరం కావని అన్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా ఎన్నికైన వారిని అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. వార్డ్ మెంబర్ నుంచి లోక్‌సభ సభ్యుడి వరకు అందరిని గౌరవించాలన్నారు. అందరి విషయంలో చట్టం సమానంగా ఉంటుందనీ, బాధితులకు న్యాయం అందించటంలో అంతర్భాగంగా ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారవర్గం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే కోర్టుల్లో కేసులు తగ్గుతాయన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక వసతులను త్వరతగతిన ఏర్పాటుచేయాలని సూచించారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి మరింత సిబ్బంది అవసరనీ, కోర్టుల్లో మానవవనరుల కొరత తీరితే.. కేసుల భారం తగ్గుతుందని అన్నారు. న్యాయ వ్యవస్థలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలనీ, ఏడాది కాలంగా జడ్జీల నియామకాల్లో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందని అన్నారు.
తీర్మానాలకు ఆమోదం: సీజేఐ ఎన్ వి రమణ
రెండురోజుల పాటు జరిగిన ముఖ్యమంత్రులు, సీజేల సదస్సులో పలు తీర్మానాలు ఆమోదించినట్టు జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు. కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజుతో కలిసి ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సదస్సులో న్యాయమూర్తుల నియామకంపైనా విస్తృతంగా చర్చించాం. విశ్రాంత న్యాయమూర్తుల బెనిఫిట్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి చేయాలి. ఆన్లైన్ పోర్టల్ పై న్యాయ శాఖ మంత్రితో చర్చించాం. కోర్టుల అనుసంధానం.. తక్షణం పరిష్కరించాల్సిన అంశం. కోర్టుల నెట్‌వర్క్‌కు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించి సహకరించాలి. మా ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వాలకు ధన్యవాదాలు'' అన్నారు.
న్యాయాన్ని సమర్ధవంతంగా అందించడం కోసం నిర్దిష్ట పరిష్కారాలు : కిరణ్ రిజిజు
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ దేశ పౌరులకు సకాలంలో నాణ్యమైన న్యాయాన్ని అందించే మార్గాలపై చర్చించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే ఈ ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల పట్ల మా సమిష్టి నిబద్ధతకు ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని అన్నారు. న్యాయాన్ని సమర్ధవంతంగా అందించడం కోసం నిర్దిష్ట పరిష్కారాలను కనుగొనడంపై ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య నిజాయితీ, నిర్మాణాత్మక చర్చకు ఇది ఒక ఏకైక అవకాశమని మంత్రి ఉద్ఘాటించారు.
వాణిజ్య కేసుల సత్వర పరిష్కారం కోసం కమర్షియల్ కోర్టుల చట్టం 2015 ఆమోదించామనీ, 2018లో మళ్లీ సవరించామని అన్నారు. ఇది ఢిల్లీ, ముంబాయి, కలకత్తా, బెంగళూరులలో మొదటిసారిగా ''ప్రత్యేక వాణిజ్య న్యాయస్థానాలు'' స్థాపనకు దారితీసిందని అన్నారు. దేశంలోని ప్రతి జిల్లాలో శిక్షణ పొందిన న్యాయవాదుల ద్వారా టెలి-లా సేవల విస్తరణను సులభతరం చేయడానికి నల్సాతో న్యాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంటోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి యుయు లలిత్, కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి ఎస్పి సింగ్ బాఘెల్, ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్ల హాజరయ్యారు.