Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిగేశ్ మేవానీ అరెస్టులో అసోం పోలీసులపై కోర్టు ఆగ్రహం
- పోలీసుల అధికార దుర్వినియోగంపై హైకోర్టుకు ఫిర్యాదు
న్యూఢిల్లీ : గుజరాత్ స్వతంత్ర ఎమ్మెల్యే జిగేశ్ మేవా నోరు నొక్కేయాలని, తప్పుడు కేసుతో అతడి ఇమేజ్ను దెబ్బతీయాలని చూసిన అధికార బీజేపీ అసలు బండారం బయటపడింది. ఒక తప్పుడు కేసులో మేవానీని ఇరికించారని, తప్పుడు ఆధారాలతో కోర్టు ముందుకు వచ్చారని న్యాయస్థానం అసోం పోలీసు ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు..ఈ విషయాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించాలని గౌహతీ హైకోర్టును బారాపెటా సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి ముకుల్ చేతియా కోరారు. పోలీసుల అధికార దుర్వినియోగానికి మేవానీ అరెస్టు ఒక నిదర్శనమని, దీనిని అరికట్టడంపై విచారణ జరపాలని సెషన్ కోర్టు న్యాయమూర్తి గౌహతీ హైకోర్టును కోరటం సంచలనం సృష్టించింది.
జిగేశ్ మేవానీ బెయిల్ పిటిషన్ విచారిస్తూ న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు. అసోంలో పోలీస్ రాజ్యం నడుస్తుందా?, తప్పుడు ఆధారాలతో, తప్పుడు కేసు..పెడతారా? అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అసోం పోలీసులు జిగేశ్ మేవానీని తొలుత అరెస్టు చేశారు. అయితే ఈకేసులో న్యాయస్తానం బెయిల్ ఇవ్వగా, కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే మరో కేసులో అసోం ప్రభుత్వం మేవానీని అరెస్టు చేసింది. మహిళా ఎస్ఐ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దూషించాడని పోలీసులు ఆరోపణలు నమోదుచేశారు.
ఈ ఆరోపణలు పరిగణలోకి తీసుకున్న కోక్రాజర్ మెజిస్ట్రేట్ మేవానీకి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. దీనిపై ఏప్రిల్ 28 బెయిల్ పిటిషన్ దాఖలు కాగా, పిటిషన్ విచారణ బారాపేట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందుకు వచ్చింది. పిటిషన్ విచారిస్తూ న్యాయమూర్తి పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
''మరో ఇద్దరు పోలీస్ అధికారులు వెంట ఉండగా...ఒక మహిళా ఎస్ఐతో అసభ్యంగా వ్యహరించే పరిస్థితి ఉంటుందా? ఆధారాలు చూపండి'' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. కేవలం నోటి మాటలతో ఆరోపణలు చేసి..కేసులు పెట్టేయటం వెనుక మీ ఉద్దేశం ఏముంది?, పోలీసులు నిర్ణయిస్తే..దాంతో నిందితుడికి శిక్ష వేయాలన్నట్టూ ప్రభుత్వం వ్యవహరించింది, దీనిని ఎంతమాత్రమూ ఆమోదించమని న్యాయమూర్తి అన్నారు. మహిళా ఎస్ఐ చేసిన ఆరోపణలు అంతా బూటకం, నాటకమని కోక్రాజర్ ఎస్పీ స్వయంగా తేల్చారు.
మొదటి కేసుతో మొదలు..
స్వతంత్ర ఎమ్మెల్యేగా జిగేశ్ మేవానీకి గుజరాత్లో మంచి గుర్తింపు ఉంది. ప్రధాని మోడీపై జిగేశ్ మేవానీ ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారని అసోంకు చెందిన బీజేపీ నాయకుడు ఒకరు కోక్రాజార్ పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 20న ఫిర్యాదుచేశాడు. దాంతో అసోం పోలీసులు గుజరాత్‌కు వచ్చి మేవానీని అదుపులోకి తీసుకొని అసోంకు తీసుకుపోయారు. అయితే ఈకేసులో న్యాయస్థానం మేవానీకి బెయిల్ మంజూరుచేసింది. దీనిని సహించుకోలేక అక్కడి బీజేపీ సర్కార్ మరో తప్పుడు కేసులో ఇరికించాలని వ్యూహం పన్నింది. ఏప్రిల్ 24న ఓ కేసులో బెయిల్ మంజూరు కాగానే, కోక్రాజర్ మెజిస్ట్రేట్ ముందు మరో కేసును పోలీసులు తీసుకొచ్చి పెట్టారు. మహిళా ఎస్ఐని దుర్భాషలాడారని, వేధించారని ఆరోపణలు నమోదుచేశారు. దాంతో కోక్రాజర్ మెజిస్ట్రేట్ మేవానీకి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించారు.
బందోబస్తుకు వచ్చిన మహిళా ఎస్ఐని, ఆమె వెంబడి మరో ఇద్దరు పోలీసు అధికారులు ఉండగా మేవానీ నేరం చేస్తాడా? మీరు చూశారా? అని ఆ ఇద్దరు పోలీసుల్ని బారాపేట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అడగ్గా..వారు 'నిజమే..చూశాం..' అని చెప్పలేదు. దాంతో న్యాయమూర్తి జిల్లా పోలీసులపై, ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్లో బీజేపీ సర్కార్ వైఫల్యాన్ని పదే పదే ఎండగడుతున్న జిగేశ్ మేవానీ, అక్కడి పాలకులకు ఒక కొరకరాని కొయ్యలా మారాడు. రాజకీయంగా తమను ఎదిరిస్తున్నాడని, అతడి నోరు మూయించాలన్న ఉద్దేశంతో ఈ అరెస్టులు జరిగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.