Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొవిడ్‌తో 52 లక్షల కోట్ల నష్టం : ఆర్బీఐ
న్యూఢిల్లీ : కరోనా సంక్షోభ నష్టాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి 10 నుంచి 15 ఏండ్లు పట్టొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లోని ఓ కీలక విభాగం అంచనా వేసింది. ఆర్థిక సంవత్సరం 2021-22 రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్ (ఆర్సీఎఫ్)లో 'మహమ్మారి మచ్చలు' అనే నివేదికలో ఆర్బీఐ ఈ అంశాన్ని వెల్లడించింది. దీన్ని ఆర్థిక, విధాన పరిశోధన శాఖ (డీఈపీఆర్) అధికారులు రూపొందించారు. అయితే ఈ రిపోర్ట్‌లోని అంశాలు సెంట్రల్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించకూడదని పేర్కొనడం విశేషం. కరోనా కాలంలో దేశ ఉత్పత్తిలో రూ.52 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనావేసింది. వైరస్ పలుసార్లు రావడంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడిందని తెలిపింది. దీంతో స్థూల దేశీయోత్పత్తి ఆటుపోట్లకు గురైందని వెల్లడించింది.
రిపోర్ట్ వివరాలు.. వివిధ దశల్లో విజృంభించిన కరోనా ప్రభావం పలు త్రైమాసికాలపై స్పష్టంగా కనబడింది. దీని దెబ్బకు ముఖ్యంగా 2020-21 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో వృద్థి భారీగా క్షీణించింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటుండగానే.. తిరిగి 2021-22 ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో రెండో దశ రూపంలో మరోసారి తీవ్ర ప్రభావం చూపింది. 2022 జనవరిలో వచ్చిన మూడో వేవ్ మరోసారి ఆర్థిక వ్యవస్థను ఒత్తిడికి గురిచేసింది. ఉత్పత్తి పరంగా విశ్లేషిస్తే 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.17.1 లక్షల కోట్లు, 2022-23లో రూ.16.4 లక్షల కోట్ల చొప్పున నష్టం చోటు చేసుకుందని ఈ రిపోర్ట్ అంచనా వేసింది.
''అంతర్జాతీయంగా ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ దేశాల వృద్థికి నష్టం జరుగుతున్నది. నిత్యావసరాల ధరల పెరుగుదల, అంతర్జాతీయ సరఫరాల వ్యవస్థలో అంతరాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కరోనాకు ముందు ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టిన సంస్కరణల ఫలితాలు.. వైరస్ సంక్షోభ కాలంలో చేపట్టిన అదనపు చర్యల వల్ల వృద్థికి దోహదం చేయనున్నాయి'' అని ఈ రిపోర్టు పేర్కొంది.
కరోనాకు ముందు 2012-13 నుంచి 2019-20 మధ్య సగటున ఏడాదికి 6.6 శాతంగా వృద్థి రేటు నమోదయ్యింది. 2020-21లో మైనస్ 6.6శాతానికి పడిపోయింది. 2021-22లో 8.9శాతంగా చోటు చేసుకుంది. 2022-23లో 7.3 శాతం పెరుగుదల.. ఆ తర్వాత ప్రతీ ఏడాది సగటున 7.5శాతం వృద్థి అంచనా వేసినా.. కరోనా నష్టాలను అధిగమించడానికి 2034-35 వరకు సమయం పడుతుందని విశ్లేషించింది. మెరుగైన వృద్థి రేటును సాధించాలంటే ధరల స్థిరత్వం తప్పనిసరి అని సూచించింది.