Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోర్టుల్లో స్థానిక భాషను ప్రోత్సహించాలి
- 1,450 చట్టాలను తొలగించాం
- న్యాయ సంస్కరణ విధానపరమైన అంశం కాదు
- కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ముఖ్యం
- అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా న్యాయ విద్య
- పేదలు, సామాన్యులే జైల్లో మగ్గుతున్నారు : ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : దేశం అమృత కాలంలో ఉందనీ... ఈ సమయంలో ప్రతి ఒక్కరికీ సులభంగా, సత్వర న్యాయం అందించే న్యాయవ్యవస్థ కోసం మనమంతా ఆలోచన చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దేశంలో న్యాయ విద్య అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్టు ఉండేలా చూడటం మనందరి బాధ్యతని అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన
న్యాయమూర్తులు, లెఫ్టినెంట్ గవర్నర్ల 11వ సంయుక్త సదస్సు శనివారం నాడిక్కడ విజ్ఞాన్ భవన్లో జరిగింది. ఆరేండ్ల తర్వాత జరిగే ఈ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
కోర్టుల్లో స్థానిక భాష ఉపయోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తద్వారా సాధారణ పౌరుల్లో న్యాయవ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పెంపొందించవచ్చని అన్నారు. అంతేకాకుండా న్యాయ వ్యవస్థకు వారిని దగ్గర చేసినట్టు అవుతుందన్నారు. న్యాయ ప్రక్రియపై ప్రజల హక్కు దీని ద్వారా బలపడుతుందని ఆయన అన్నారు. సాంకేతిక విద్యలో కూడా స్థానిక భాషలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. న్యాయ వ్యవస్థ సంస్కరణ కేవలం విధానపరమైన అంశం కాదని ప్రధాని మోడీ అన్నారు. అందులో మానవ సున్నితత్వాలు ఇమిడి ఉన్నాయనీ, వాటిని అన్ని చర్చల మధ్యలో ఉంచాలని తెలిపారు.
పేదలు, సామాన్యులే జైల్లో మగ్గుతున్నారు
ప్రస్తుతం దేశంలో దాదాపు 3.5 లక్షల మంది ఖైదీలు విచారణలో ఉండి జైలులో ఉన్నారనీ, వీరిలో ఎక్కువ మంది పేద, సామాన్య కుటుంబాలకు చెందిన వారేనని ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో జిల్లా జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ ఉంటుంది, తద్వారా ఈ కేసులను సమీక్షించవచ్చునని చెప్పారు. సాధ్యమైన చోట, అటువంటి ఖైదీలను బెయిల్పై విడుదల చేయవచ్చన్నారు. ''మానవతా భావాలు, చట్టం ఆధారంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను అందరు ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేస్తాను'' అని ఆయన చెప్పారు.
కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం సాధనం
ముఖ్యంగా స్థానిక స్థాయిలో కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఒక ముఖ్యమైన సాధనమని ప్రధాని మోడీ అన్నారు. మన సమాజంలో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం వేల సంవత్సరాల నాటి సంప్రదాయమన్నారు. పరస్పర అంగీకారం, పరస్పర భాగస్వామ్యం, న్యాయ విలక్షణమైన మానవ భావన అని ఆయన అన్నారు. ఈ ఆలోచనతోనే ప్రభుత్వం మధ్య వర్తిత్వ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని ప్రధాని చెప్పారు. ''2047 నాటికి దేశం స్వాతంత్య్రం పొంది వందేండ్లు పూర్తవుతుంది. అప్పుడు మనం దేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను చూడాలనుకుంటున్నాం? 2047 నాటి దేశ ఆకాంక్షలను నెరవేర్చగలిగేలా మన న్యాయ వ్యవస్థను ఎలా సమర్థంగా తీర్చిదిద్దాలి. ఈ ప్రశ్నలే మన ప్రాధాన్యతగా ఉండాలి'' అని అన్నారు.
2015 నుంచి 1,450 చట్టాలను తొలగించాం
పురాతన చట్టాలను తొలగించాల్సిన అవసరం ఉందని, 2015లో 1,800 పాత చట్టాలను గుర్తించి.. 1,450 చట్టాలను తొలగించామన్నారు. కానీ, రాష్ట్రాలు మాత్రం ఇప్పటివరకు 75 చట్టాలనే తొలగించాయని అన్నారు. ''తమ రాష్ట్ర పౌరుల హక్కులు, వారి జీవన సౌలభ్యం కోసం కచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రులందరినీ కోరుతున్నాను'' అని అన్నారు.
న్యాయ పంపిణీలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం
న్యాయ పంపిణీలో జాప్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదనీ, న్యాయ వ్యవస్థ బలాన్ని పెంపొందించడానికీ, న్యాయపరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నా యని అన్నారు. కేసుల నిర్వహణ కోసం ఐసీటీని వినియోగించామని, న్యాయ వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో ఖాళీల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వసతులను నవీకరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థలో సాంకేతికత వినియోగాన్ని పెంపొందించామని చెప్పారు. దీనిని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు.