Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ బాలేకున్నా... ముందుకెళ్తున్న మోడీ సర్కార్
- పబ్లిక్ ఇష్యూ ఇప్పుడొద్దని ఉన్నతాధికారి సూచన!
- మార్కెట్ విలువ తగ్గిస్తున్న కేంద్రం
న్యూఢిల్లీ : జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో తన వాటా అమ్మకం కోసం కేంద్రం తొందరపడుతోంది. వీలైనంత త్వరగా వేలకోట్లు తన ఖజానాలో వేసుకోవాలని తహతహ లాడుతోంది. నిధుల సమీకరణ కోసం ప్రభుత్వరంగ సంస్థగా ఎల్ఐసీకు ఉన్న విలువను, పరపతిని సైతం దెబ్బతీసేలా వ్యవహరిస్తోంది. తొలుత ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ.12 నుంచి 14 లక్షల కోట్లు ఉంటుందని జాతీయ మీడియాలో అనధికారిక వార్తలు వెలువడ్డాయి. కేంద్రం నుంచి విడుదలైన రకరకాల సమాచారంతో ఈ వార్తలు వెలువడ్డాయి. ఫిబ్రవరిలో కంపెనీ మార్కెట్ విలువను కేంద్రం హఠాత్తుగా రూ.6లక్షల కోట్లకు తగ్గించటం మార్కెట్ వర్గాల్ని గందరగోళానికి గురిచేసింది. స్టాక్ మార్కెట్లో బీమా కంపెనీల షేర్లేవీ పెద్దగా పతనం కాలేదు, అంతర్జాతీయ పరిణామాల కారణంగా ప్రయివేటు బీమారంగమూ దెబ్బతినలేదు. అయినా ఎల్ఐసీ మార్కెట్ విలువను అమాంతం 50శాతానికిపైగా కేంద్రం ఎందుకు తగ్గించింది? అనే దానికి సమాధానం లేదు.
ఏ ప్రాతిపదికన కంపెనీ విలువను తగ్గించారన్నది కేంద్రంలోని పెద్దలెవరూ చెప్పటం లేదు. ప్రపంచంలో 10వ అతిపెద్ద బీమా బ్రాండ్ ఎల్ఐసీ. ఆసియాలో టాప్-2 స్థానంలో ఉంది. అయితే ఇదంతా మోడీ సర్కార్కు కనపడటం లేదు. ఎల్ఐసీలో వాటాల అమ్మకం తగదు..అని చెప్పినా వినటం లేదు. ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ జారీకి సిద్ధపడింది. ఉక్రెయిన్ సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాలు ఏమాత్రమూ సానుకూలంగా లేవని, ఇలాంటి పరిస్థితిల్లో పబ్లిక్ ఇష్యూపై ముందుకు వెళ్లవద్దని పెట్టుబడులు ఉపసంహరణ విభాగాన్ని చూస్తున్న జాయింట్ సెక్రటరీ సైతం కేంద్రానికి సూచన చేశారట. అయినప్పటికీ వచ్చేవారం పబ్లిక్ ఇష్యూ విడుదల చేయాలని కేంద్రం పట్టుదలతో ఉంది. 3.5శాతం వాటాను అమ్మటం ద్వారా రూ.21వేల కోట్లను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ఉక్రెయిన్ సంక్షోభం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ప్రయివేటు కంపెనీలేవీ పబ్లిక్ ఇష్యూకు వెళ్లటం లేదు. ఐపీవోలకు వెళ్తున్నామని ప్రకటించిన కంపెనీలు, తమ పబ్లిక్ ఇష్యూ తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఇవేవీ కేంద్రంలో మోడీ సర్కార్కు కనపడటం లేదు. ఎల్ఐసీ మార్కెట్ విలువను తగ్గించైనా సరే..షేర్ల అమ్మకానికి వేగంగా పావులు కదుపుతోంది. సెబీ సైతం సుముఖంగా లేదని సమాచారం. మొదట 10శాతం వాటాల అమ్మకం అని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత 5శాతానికి తగ్గించింది. ఇప్పుడు 3.5శాతం వాటాల అమ్మకం జరుపుతారని అనధికారిక సమాచారం.